NTV Telugu Site icon

Kolkata: డాక్టర్ల సామూహిక రాజీనామాలు తిరస్కరణ.. వ్యక్తిగతంగా సమర్పించాలన్న ప్రభుత్వం

Rgkarhospital

Rgkarhospital

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగించారు. అనంతరం వారితో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. అయితే తమ భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. వీరికి మద్దతుగా సీనియర్ డాక్టర్లు కూడా సామూహిక రాజీనామాలు చేశారు. ఒక్కో రోజు కొంత మంది రాజీనామాలు సమర్పించారు.

ఇది కూడా చదవండి: Usha Sri Charan: విజయదశమి రోజు మహిళలపై గ్యాంగ్‌రేప్‌ అత్యంత దుర్మార్గం: మాజీ మంత్రి

తాజాగా ఆ రాజీనామాలను బెంగాల్ ప్రభుత్వం తిరస్కరించింది. సామూహిక రాజీనామాలు చట్టబద్ధంగా చెల్లుబాటు కావని తెలిపింది. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేసే వైద్యులు సామూహిక రాజీనామా చెల్లుబాటుకాదని.. సేవా నిబంధనల ప్రకారం వ్యక్తిగతంగా సమర్పించాలని శనివారం ప్రభుత్వం తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రుల నుంచి సీనియర్ వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాలేజ్ ఆఫ్ మెడిసిన్, సాగూర్ దత్తా హాస్పిటల్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGMER) వైద్యుల రాజీనామా చేసి జూనియర్‌లకు మద్దతు తెలిపారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఈ ఆసుపత్రుల వైద్యులు రాజీనామాలు సమర్పించారు. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ స్పందిస్తూ.. మూకుమ్మడి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించబోదని స్పష్టం చేశారు.

‘‘రాజీనామాలు రూల్ బుక్ ప్రకారం ఉద్యోగి మరియు యజమాని మధ్య వ్యక్తిగత విషయం. ఈ సామూహిక లేఖలకు చట్టపరమైన విలువ లేదు’’ అని బంద్యోపాధ్యాయ రాజీనామాలను తప్పు భావనగా తోసిపుచ్చారు. మాకు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి చెల్లాచెదురుగా లేఖలు అందాయని తెలిపారు.

ఆగస్టు 7న జూనియర్ వైద్యురాలు ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైంది. అప్పటి నుంచి జూనియర్ వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బాధిత సహోద్యోగికి న్యాయం చేయాలని, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజీనామా చేయాలని, కార్యాలయంలో భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులలో జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు