NTV Telugu Site icon

Suvendu: మైనారిటీ మోర్చాపై సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు

Suvendu

Suvendu

మైనారిటీ మోర్చాపై పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మైనారిటీ కమ్యూనిటీ నుంచి మద్దతు లభించలేదని.. అందుకే బీజేపీ సీట్లు గెలవలేకపోయిందన్నారు. దీంతో ఆయన ‘సబ్కా సాత్, సబ్‌కా వికాస్’ అనవసరమన్నారు. దీనికి బదులుగా ‘హమ్ ఉంకే సాథ్ జో హుమారే సాథ్’ను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలు బీజేపీతో లేనప్పుడు మైనారిటీ మోర్చా అవసరం లేదని పేర్కొ్న్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యకర్త సమావేశంలో సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ ఎన్నికల సమయంలో చాలా ప్రాంతాల్లో టీఎంసికి చెందిన జిహాదీ గూండాలు హిందువులు ఓటు వేయడానికి అనుమతించలేదని సువేంద్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం సాధ్యం కాదన్నారు. టీఎంసీకి చెందిన జిహాదీ గూండాలు అనుమతించరని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయన్నారు. అప్పుడే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీ ఓటర్లు 30 శాతం మంది ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీ ఓట్లు టీఎంసీకి పడ్డాయి. ఉత్తరాన మాత్రం వామపక్షాలు-కాంగ్రెస్ ఓట్ల విభజనతో మాత్రం బీజేపీకి లాభించింది.

ఇక గత వారం జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసి  మూడు అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకుంది. దీంతో బీజేపీ నైరాశంలో పడింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలు గెలిస్తే.. 2024లో 12 స్థానాలే సొంతం చేసుకుంది. ఇక సువేందు వ్యాఖ్యాలు వివాదాస్పదం కావడంతో తన వ్యాఖ్యలు ఏ వర్గాన్ని ఉద్దేశించినవి కావని తెలిపారు.