Ramagundam Fertilizers: నేడు ప్రధాని మోడీ ప్రారంభించనున్న రామగుండం ఎరువుల కర్మాగారంతో దక్షిణాది రాష్ట్రాల రైతులకు ఊరట లభించనుంది. 1970లో ప్రారంభమైన ఈ కర్మాగారం.. 2002లో మూతపడింది. వివిధ కారణాల వల్ల.. గతంలో ఎరువుల్ని ఉత్పత్తి చేసిన 5 కర్మాగారాలను వివిధ కారణాలతో మూసివేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ఐదు కర్మాగారాలను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఐదింటిలో ఈ రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ ఒకటి. రూ. 6,500 కోట్ల వ్యయంతో ఈ గ్యాస్ ఆధారిత కర్మాగారం పునఃప్రారంభమవుతోంది. 2021 మార్చి నుంచి ఇప్పటిదాకా ఈ ఫ్యాక్టరీ 8.8 మెట్రిక్ టన్నుల యూరియాని ఉత్పిత్తి చేసింది. ఇప్పుడు దీని నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడంతో.. దీనికి మోడీ జాతికి అంకితమివ్వనున్నారు.
ఈ రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో తెలంగాణ రాష్ట్రానికి 11 % వాటా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఈ కర్మాగారానికి 0.55 టీఎంసీ నీరు సరఫరా అవుతోంది. కిసాన్ పేరుతో ఆర్‌ఎఫ్‌సీఎల్ యూరియా మార్కెట్‌లోకి వస్తోంది. కేవలం యూరియానే కాదు.. అమ్మోనియాని కూడా ఈ కర్మాగారం ఉత్పత్తి చేయనుంది. రోజుకి 3850 మెట్రిక్ టన్నుల యూరియా, 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కర్మాగారానికి ఉంది. ఈ కర్మాగారం.. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL)ల జాయింట్ వెంచర్ కంపెనీ. ఇందులో NFL & EILల చెరో 26% ఈక్విటీ భాగస్వామ్యం ఉండగా.. CCEA ఆమోదం పరంగా FCILకి 11% ఈక్విటీ మంజూరు చేయబడింది. ఇక తెలంగాణ ప్రభుత్వానికి 11% ఈక్విటీ భాగస్వామ్యం ఉంది.
రామగుండం కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న యూరియాని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళకి సరఫరా అవుతుంది. ఈ కర్మాగారంలో కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి వాటా ఉంది. ఈ ఎరువుల కర్మాగారంతో పాటు తెలంగాణలో మూడు జాతీయ రహదారుల విస్తరణ, ఒక రైల్వే లైన్ పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం కేంద్రం రూ.4,300 కోట్ల నిధులు ఇవ్వనుంది.