Bathinda military station firing: పంజాబ్ భటిండా మిలిటరీ స్టేషన్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భటిండా పోలీసులు ఒక ఆర్మీ జవాన్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టును పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. దీనిపై పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించారు. కాల్పులు జరిపే సమయంలో తెల్లటి కుర్తా పైజామా ధరించి, రైఫిల్ మరియు గొడ్డలిని కలిగి ఉన్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై పంజాబ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Also: Atiq Ahmed: అతిక్ అహ్మద్ శరీరంలో మొత్తం 8 బుల్లెట్లు..
అయితే ఆర్మీ వర్గాలకు చెందిన వ్యక్తే ఈ కాల్పులకు తెగబడినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనలో ఉగ్రకోణం లేదని పోలీసులు తెలిపారు. ఘటనకు ముందు మిలిటరీ స్టేషన్ నుంచి ఓ రైఫిల్ మిస్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. బుధవారం తెల్లవారుజామున భటిండా మిలిటరీ స్టేషన్ లోని అధికారుల మెస్ వెనక ఉన్న బ్యారక్ కు సమీపంలో నిద్రిస్తున్న నలుగురు ఆర్మీ జవాన్లను కాల్చి చంపారు. తెల్లవారుజామున 4:35 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభిచారు. అయితే ఈ ఘటనకు ఇంకా కారణాలు తెలియరాలేదు. ఈ రోజు వీటి గురించి పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.