Site icon NTV Telugu

UP: బరేలీలో హై అలర్ట్.. 48 గంటలు ఇంటర్నెట్ సేవలు బంద్

Up

Up

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ పోస్టర్ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రస్తుతం బరేలీ డివిజన్‌లో అశాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయింది. బరేలీ డివిజన్‌లోని నాలుగు జిల్లాల్లో హోంశాఖ హై అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 2 మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్టోబర్ 4 మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు.

ఇది కూడా చదవండి: UP: వరకట్నం హత్య కేసులో షాకింగ్ ఘటన.. రెండేళ్ల తర్వాత బిగ్ ట్విస్ట్

దసరా సందర్భంగా మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వదంతులు సృష్టించి మతకల్లోలాలు సృష్టించే అవకాశం ఉన్నందున ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, మెసేజింగ్ సేవలను నిలిపివేసినట్లు హోం కార్యదర్శి గౌరవ్ దయాల్ ఉత్తర్వులో తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నామని వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లో ‘ఐ లవ్ ముహమ్మద్’’ ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బరేలీ స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ‘ఐ లవ్ ముహమ్మద్’ మద్దతుగా నిరసనలకు పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసనలకు పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో బరేలీలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తౌకీర్ రజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తౌకీర్ రజా ఇంటి వెలుపల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలివచ్చి ‘ఐ లవ్ ముహమ్మద్’ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ నిర్వహించారు.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat: ట్రంప్ టారీఫ్‌పై మోహన్ భగవత్ స్వదేశీ మంత్రం..

ఐ లవ్ ముహమ్మద్ ప్రచారానికి మద్దతుగా రజా ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో భారీ ఎత్తున జనసమూహం తరలిచ్చింది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘర్షణలో 10 మంది పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. 50 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని.. 1,700 మంది గుర్తు తెలియని వ్యక్తులపై అల్లర్లు, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజలకు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు బరేలీలోని అధికారులను ఆదేశించారు.

సెప్టెంబర్ 4న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా దారి పొడవునా ఒక టెంట్‌పై ‘ఐ లవ్ ముహమ్మద్’ అనే పోస్టర్‌ను ఉంచడంతో ఈ వివాదం ప్రారంభమైంది. రామ నవమి వంటి హిందూ పండుగలు జరుపుకునే ప్రదేశంలో ఈ పోస్టర్‌ను ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారని స్థానిక హిందూ సంఘాలు తప్పుపట్టాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీశాయి. తమ పోస్టర్లను చింపి తొలగించారని హిందువులు ఆరోపించగా.. ప్రవక్త పట్ల ప్రేమను వ్యక్తం చేసినందుకు తమను లక్ష్యంగా చేసుకున్నారని ముస్లింలు పేర్కొన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇలా వారాల తరబడి ఈ వివాదం నడుస్తోంది. తాజాగా ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇక వారణాసిలో ‘ఐ లవ్ మహమ్మద్’ పోస్టర్లకు వ్యతిరేకంగా ‘ఐ లవ్ మహాదేవ్’ ప్లకార్డులతో ఇరు వర్గాల మతాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే దసరా సందర్భంగా మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో బరేలీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Exit mobile version