Bangladesh: బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం షేక్ హసీనాను అప్పగించాలని బలంగా కోరుతోంది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనాని స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ఇంటర్‌పోల్ సాయాన్ని కోరింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసిందని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ఆరోపణలు చేస్తోంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో 700 మందికి పైగా హత్యలు చోటు చేసుకున్నాయని, దీనికి అప్పటి ప్రధాని హసీనా ఇచ్చిన ఆదేశాలే కారణమని బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆరోపిస్తోంది.
Read Also: UK: ప్రధాని నేతృత్వంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో మాంసం, మద్యం.. హిందూవుల్లో ఆగ్రహం
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలై-ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్లు తీవ్రతరం కావడంతో ఆగస్టు 05న ప్రధాని షేక్ హసీనా భారత్‌కి పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రకారం, నిరసనల సమయంలో కనీసం 753 మంది మరణించారు. షేక్ హసీనాతో పాటు ఆమె పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులపై పలు కేసులు నమోదయ్యయాయి.
“ఇంటర్‌పోల్ ద్వారా త్వరలో రెడ్ నోటీసు జారీ చేయబడుతుంది. ఈ పారిపోయిన ఫాసిస్టులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా, వారిని తిరిగి తీసుకువచ్చి కోర్టులో జవాబుదారీగా ఉంచుతాము” అని న్యాయ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఇక్కడ విలేకరులతో అన్నారు. అక్టోబర్ 17న, ట్రిబ్యునల్ హసీనా మరియు ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ మరియు ఆమె మాజీ క్యాబినెట్ సభ్యులతో సహా 45 మందిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.