NTV Telugu Site icon

Bangladesh: ‘‘జమాతే ఇస్లామీ’’పై నిషేధాన్ని ఎత్తేసిన బంగ్లాదేశ్.. షేక్ హసీనా హయాంలో బ్యాన్..

Bangladesh

Bangladesh

Bangladesh: రిజర్వేషన్ కోటా రిజర్వేషన్ల రద్దు కోసం బంగ్లాదేశ్ అట్టుడికిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి ఎసరు పెట్టింది. ఈ ఆందోళనలు తీవ్రమైన హింసాత్మక చర్యలకు దారి తీయడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆగస్టు 5న ఇండియా పారిపోయి వచ్చేసింది. ప్రస్తుతం నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా మైనారిటీలు ముఖ్యంగా హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి.

Read Also: Chandrababau: ఏపీ విషయంలో కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోంది..

బంగ్లాదేశ్ ఆందోళనలకు బీఎన్‌పీ పార్టీతో పాటు రాడికల్ భావాలు కలిగిన జమాతే ఇస్లామీ పార్టీ కార్యకర్తలు, వాటి అనుబంధ విద్యార్థి సంఘాలే కారణమని తెలుస్తోంది. షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్ందనే అభియోగాలపై ‘‘జమాతే ఇస్లామీ’’ని నిషేధించారు. అయితే, ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం బుధవారం ఈ సంస్థపై నిషేధాన్ని ఎత్తేసింది. జమాత్, దాని అనుబంధ సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్లు నిర్ధిష్ట ఆధారాలు లేవని చెప్పింది.

హింసను ప్రేరేపించామనే ఆరోపణల్ని జమాతే ఇస్లామీ పార్టీ ఖండించింది. నిషేధం ‘‘చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం’’ అని చెప్పింది. జమాత్ బంగ్లాదేశ్ లౌకిక రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయ పార్టీగా నమోదు చేయబడిందని కోర్టు 2013లో పేర్కొన్న తర్వాత బంగ్లాదేశ్‌లో ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది. రిజిస్ర్టేషన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ వచ్చే వారం ప్రారంభంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ తరపు న్యాయవాది శిశిర్ మోనీర్ తెలిపారు.