Bangladesh: భారతదేశం ముక్కలైతేనే బంగ్లాదేశ్‌కు ‘‘పూర్తి శాంతి’’ లభిస్తుందని బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ జనరల్ అన్నారు.ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జమాతే-ఇ-ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమారుడు బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ ముక్కలుగా విడిపోనంత కాలం బంగ్లాదేశ్ పూర్తి శాంతిని చూడదు’’ అని అజ్మీ అన్నారు. భారత్, బంగ్లాదేశ్‌లో ఎల్లప్పుడూ అశాంతి ఉండేలా చూస్తోందని ఆయన ఆరోపించారు. భారత సరిహద్దులో ఆగ్నేయ బంగ్లాదేశ్‌లో ఉన్న చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ ప్రాంతంలో 1975 నుంచి 1996 వరకు భారత్ అశాంతిని రేకెత్తించిందని ఆయన అన్నారు.
Read Also: Jihad Remark: ‘‘జిహాద్’’ చేయాల్సి రావచ్చు.. పార్లమెంట్ సాక్షిగా ఎస్పీ ఎంపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
‘‘షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వ కాలంలో, పర్బత్య చటోగ్రామ్ జన సంహతి సమితి (PCJSS) ఏర్పడింది, దాని సాయుధ విభాగం శాంతి బాహిని. భారతదేశం వారికి ఆశ్రయం కల్పించింది, ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది, ఇది 1975 నుండి 1996 వరకు చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్‌లో రక్తపాతానికి దారితీసింది’’ అని మాజీ సైనిక అధికారి అన్నారు. 1997లో చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ శాంతి ఒప్పందాన్ని విమర్శిస్తూ.. శాంతి బాహిని ఆయుధాలను అప్పగించడం కేవలం ప్రదర్శన కోసమే అని అజ్మీ ఆరోపించారు.
భారత్‌పై సోషల్ మీడియా వేదికగా అజ్మీ విషం వెళ్లగక్కుతూ ఉంటారు. షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత, భారత్ బంగ్లా సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అజ్మీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత బంగ్లా తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ భారత వ్యతిరేకతను బంగ్లాదేశ్‌లో నూరిపోస్తున్నాడు. జమాతే ఇస్లామి వంటి రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థల నేతల్ని జైలు నుంచి విడుదల చేశారు. అజ్మీ ప్రకటన కేవలం ప్రకటనగా మాత్రమే చూడలేమని, బంగ్లా అధికార పర్యావరణ వ్యవస్థలో ఏర్పడిన ఒక ‘‘ఆలోచన’’ అని భారత రక్షణ నిపుణులు చెబుతున్నారు. జమాతే ఇస్లామీ అనే సంస్థ 1971 బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో బంగ్లాదేశ్‌ను సమర్థించిన వారిపై, హిందువులపై అత్యాచారాలకు పాల్పడింది.
