Site icon NTV Telugu

Sheikh Hasina: షేక్ హసీనాపై ‘‘మారణహోమం’’ దర్యాప్తు ప్రారంభించిన బంగ్లాదేశ్ కోర్టు..

Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina: రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా ఆ దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియా పారిపోవాల్సి వచ్చింది. ఈ అల్లర్లతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 560కి చేరింది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే షేక్ హసీనా గత కేసుల్ని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం తిరగదోడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధానితో పాటు మరో 9 మందిపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ జూలై 15 నుంచి ఆగస్టు 054 వరకు జరిగిన ‘‘మారణహోమం’’, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాల ఆరోపణలపై విచారణ ప్రారంభించింది.

హసీనా, అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి, రోడ్డు రవాణా, వంతెనల శాఖ మాజీ మంత్రి ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ మరియు పార్టీలోని పలువురు ప్రముఖులపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ దర్యాప్తు సంస్థలో బుధవారం ఫిర్యాదు నమోదైంది. ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించిందని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది గాజీ ఎంహెచ్ తమీమ్ గురువారం ధృవీకరించినట్లు ది ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.

Read Also: US video: ఎయిర్‌పోర్టులో మహిళ వీరంగం.. నేలకేసికొట్టిన కంప్యూటర్, ఫోన్

దర్యాప్తు సంస్థ బుధవారం రాత్రి నుంచి విచారణ ప్రారంభించిందని తెలిపారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌తో పాటు దాని అనుబంధ సంస్థల పేర్లు కూడా పిటిషన్లో ఉన్నాయి. విద్యార్థి ఉద్యమంలో హత్యకు గురైన 9వ తరగతి చిన్నారి ఆరిఫ్ అహ్మద్ సియాన్ తండ్రి బల్బుల్ కబీర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. హసీనా ప్రభుత్వం విద్యార్థి నిరసనకారులపై హింసాత్మక అణిచివేతకు పాల్పడిందని కబీర్ ఆరోపించారు. తీవ్రమైన మానసిక ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపించారు.

జూలై 1 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన హత్యలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విచారణ జరుపుతుందని మధ్యంతర ప్రభుత్వం ప్రకటించిన రోజునే ఈ ఫిర్యాదు వచ్చింది. ఇదిలా ఉంటే దీనికి ముందు 2015లో లాయర్‌ని కిడ్నాప్ చేసిన కేసులో హసీనాతో పాటు ఆమె మంత్రివర్గంలోని మాజీ మంత్రులపై బుధవారం కిడ్నాప్ కేసు నమోదు చేసింది. దీనికి తోడు మంగళవారం హింసాత్మక ఘటనల్లో ఆరుగురి హత్య జరిగిన నేపథ్యంలో ఈ అభియోగాలను కూడా షేక్ హసీనాపై మోపారు. జూలై 19న కోటా నిరసనల సందర్భంగా రాజధానిలోని మహ్మద్‌పూర్ ప్రాంతంలో పోలీసుల కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబూ సయీద్‌ మృతిపై హసీనాతో పాటు మరో ఆరుగురిపై దాఖలైన కేసు దర్యాప్తు నివేదికను సెప్టెంబర్ 15లోగా సమర్పించాలని ఢాకా కోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. .

Exit mobile version