NTV Telugu Site icon

Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై దేశవ్యాప్తంగా నిషేధం.. అతిక్రమిస్తే లక్ష జరిమానా..

Single Use Plastic Banned

Single Use Plastic Banned

పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ వస్తువులపై నేటి నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నిషేధాన్ని ఏకకాలంలో కాకుండా దశలవారీగా అమలు చేయాలని కంపెనీలు, వాణిజ్య సంస్థలు కోరినా.. కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి నేరుగా చర్యలు తీసుకోవడానికి బదులు తొలుత ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే సంస్థలు, పంపిణీ, నిల్వ, అలాంటి వస్తువుల అమ్మకాలు జరిపే వాటిపై ప్రచారం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.ఈ సందర్భంగా దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి రూ.లక్ష వరకు జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ శుక్రవారం వెల్లడించారు.

DRDO: మానవరహిత యుద్ధ విమానాన్ని తొలిసారి పరీక్షించిన డీఆర్డీవో

గతేడాది ఆగస్టులోనే కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల శాఖ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సవరణ రూల్ 2021ను నోటిఫై చేసింది. ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రూల్ ప్రకారం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయం నిషేధం. ఈ నిబంధన ప్రకారం ఇయర్‌ బడ్స్‌, బెలూన్లకు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, ప్లాస్టిక్‌ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, క్యాండీలకు వాడే ప్లాస్టిక్‌ పుల్లలు ఇలా మొత్తం 19 రకాల వస్తువులపై నిషేధం విధించారు.

ఈ నిబంధనను అతిక్రమించిన వారు శిక్షార్హులని కేంద్రం వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్షను విధించవచ్చు. అంతేకాకుండా రూ.లక్ష వరకు జరిమానా కూడా విధించవచ్చు.