NTV Telugu Site icon

Punjab: ఐఎస్ఐతో లింకు ఉన్న ఉగ్రవాది లాజర్ మాసిహ్‌ అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Babbarkhalsa

Babbarkhalsa

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉగ్రవాది లాజర్ మాసిహ్‌ను యూపీ, పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మన్‌కు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ మాడ్యూల్ అధిపతి స్వర్ణ్ సింగ్ అలియాస్ జీవన్ ఫౌజీ కోసం ఈ ఉగ్రవాది పని చేస్తున్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ కార్యకర్తలతో కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లుగా యూపీ ఎస్‌టీఎఫ్ పోలీసులు కనుగొన్నారు. ఈ తెల్లవారుజామున అమృతసర్‌లో అదుపులోకి తీసుకోగా.. అతడి దగ్గర నుంచి మూడు హ్యాండ్ గ్రెనేడ్‌లు, రెండు యాక్టివ్ డిటోనేటర్లు, 13 కార్ట్రిడ్జ్‌లు, ఒక రష్యన్ తుపాకీ, అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తెల్లటి రంగు పేలుడు పొడి, ఘజియాబాద్ చిరునామాతో కూడిన ఆధార్ కార్డు, సిమ్ కార్డ్ లేని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

లాజర్ మాసిహ్‌… ప్రస్తుతం పాకిస్థాన్ ఐఎస్‌ఐతో కలిసి ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. లాజర్ మాసిహ్ పంజాబ్‌లోని అమృత్‌సర్ నివాసం ఉంటున్నాడు. స్వర్ణ్ సింగ్ అలియాస్ జీవన్ ఫౌజీతో లాజర్ మాసిహ్‌కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 24న పంజాబ్ జైలు నుంచి లాజర్ మాసిహ్ తప్పించుకుని పారిపోయాడు. పంజాబ్ పోలీసులు, యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో గురువారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో అతన్ని పట్టుకున్నట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమితాబ్ యష్ తెలిపారు.