Baba Siddique murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్యలో మరో అరెస్ట్ జరిగింది. హత్య కోసం షూటర్లకు ఆయుధాలు అందించిన స్క్రాప్ డీలర్‌ని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులు ఇప్పటి వరకు 10 మంది అరెస్ట్ చేయబడ్డారు. నిందితుడిని రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన భగవత్ సింగ్ ఓం సింగ్ (32)గా గుర్తించారు, అతను ప్రస్తుతం నవీ ముంబైలో ఉంటున్నాడు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచగా.. అతడికి అక్టోబర్ 26 వరకు పోలీసుల కస్టడీకి అప్పగించింది.
Read Also: Crime : ప్రియుడికి చేయి కోసుకున్న వీడియో పంపిన యువతి, చూసి గుండెపోటుతో ప్రియుడి మృతి
అక్టోబర్ 12న జరిగిన సిద్ధిక్ హత్యలో లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా తుపాకీలు అందించినట్లు ఇతడిపై అభియోగాలు ఉన్నాయి. బంద్రాలో తన కుమారుడు జీషాన్ సిద్ధిక్ ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో ముగ్గురు షూటర్లు గుర్‌మైల్ బల్జీత్ సింగ్ (23), ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19) సిద్ధిక్‌ని కాల్చి చంపారు. ఇందులో మెయిన్ షూటర్ శివకుమార్ గౌతమ్‌తో పాటు కుట్రలో పాలుపంచుకున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఈ హత్య మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సిద్ధిక్‌కి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి సంబంధాలు ఉన్నాయని చంపినట్లు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా అందరిలో ఆసక్తిని పెంచింది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ వెళ్లిన సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల్ని వేటాడి చంపాడనేది ఆరోపణ. కృష్ణ జింకలు బిష్ణోయ్ కమ్యూనిటీకి అత్యంత ఆరాధనీయమైనవి. దీంతో బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.