NTV Telugu Site icon

Yogi Adityanath: అయోధ్యలో సీఎం యోగి గుడి.. ప్రతిరోజు రెండుసార్లు పూజలు

Yogi Adityanath Temple

Yogi Adityanath Temple

Yogi Adityanath: అయోధ్య అనగానే అందరికి గుర్తొచ్చేది రాముడు పుట్టిన స్థలం అని.. అదే అయోధ్యలో ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు గుడికట్టి రాముడిగా పూజిస్తున్న వార్త సంచలనం రేపుతోంది. ప్రభాకర్ మౌర్య అనే ఆధ్యాత్మిక గాయకుడు యోగి ఆదిత్యనాథ్ కు భక్తుడిగా మారిపోయారు. యోగి ఆదిత్యనాథ్ రాముడిగా గుడి కట్టించి ఇటీవలే ప్రారంభించారు. యోగి ఆదిత్యనాథ్‌పై అభిమానంతో ఏకంగా గుడినే కట్టించాడు ఆ యువకుడు.

అయోధ్యకు చెందిన 32 ఏళ్ల ప్రభాకర్‌ మౌర్య భరత్‌కుండ్‌ సమీపంలోని పుర్వా గ్రామంలో రాముడి అవతారంలో ఉన్నట్టుగా యోగి విగ్రహాన్ని తయారు చేయించి గుడిలో ఏర్పాటు చేశాడు. రోజూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తూ యోగి పట్ల తన ఆరాధనా భావాన్ని చాటుకొంటున్నాడు. అయోధ్యలోని రామ జన్మభూమికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది భరత్​కుండ్. వనవాసానికి వెళ్లే ముందు.. రాముడికి ఇక్కడే భరతుడు వీడ్కోలు పలికాడని చెబుతుంటారు. అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ మౌర్య అనే వ్యక్తికి యోగి ఆదిత్యనాథ్​ అంటే అమితమైన అభిమానం. అందుకే ఆయన కోసం ఫైజాబాద్-ప్రయాగ్​రాజ్​ హైవే పక్కన గుడి కట్టేశాడు. కాషాయ వస్త్రధారణతో చేతిలో విల్లు, బాణంతో శ్రీరాముడు విగ్రహాన్ని పోలినట్టుగా గుడిలో ప్రతిష్ఠించాడు. శ్రీరాముడిని పూజించినట్టే యోగి విగ్రహం ముందు రోజూ శ్లోకాలు పఠిస్తుంటానని యువకుడు పేర్కొన్నాడు.

Amarinder Singh: బీజేపీలో చేరిన అమరీందర్ సింగ్.. పార్టీ కూడా విలీనం

అయోధ్యలో రామాలయం నిర్మాణం కావాలన్నది తన కల అని, రాముడి గుడి ఎవరు కట్టిస్తే వారికి గుడి కట్టి పూజ చేస్తానని 2015లో శపథం చేశానని ప్రభాకర్ మౌర్య తెలిపారు. ఆ కలను నెరవేరుస్తున్న యోగి ఆదిత్యనాథ్ కూడా రాముడేనని పేర్కొన్నారు.ఈ ఆలయం కట్టడానికి సుమారు రూ.8.5 లక్షలు ఖర్చు అయిందని, రాజస్థాన్ లో విగ్రహాన్ని తయారు చేయించి తెచ్చి ప్రతిష్టించానని ప్రభాకర్ మౌర్య వెల్లడించారు. తనకు భూమిగానీ, ఉద్యోగం గానీ లేదని.. యూట్యూబ్‌లో భజనలు, మతపరమైన పాటలను పోస్ట్‌ చేయడం ద్వారా నెలకు దాదాపు రూ.లక్ష దాకా సంపాదిస్తానని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు మహారాష్ట్రలోని పూణె సమీపంలో మయూర్ ముండే అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీకి గుడి కట్టించారు. దానిని గత ఏడాది స్వాతంత్య్రం దినోత్సవం రోజున తెరిచి పూజలు కూడా ప్రారంభించారు.