NTV Telugu Site icon

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభం అప్పుడే.. 40 శాతం పూర్తయిన పనులు

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

Ayodhya Ram Temple: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అయోధ్య శ్రీ రామ మందిరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఎళ్లుగా కోర్టులో పెండింగ్ ఈ సమస్య 2019లో సుప్రీం కోర్టు ముగింపు పలికింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో రామ జన్మభూమికి అనుకూలంగా 2019లో తీర్పు వెలువరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ జన్మభూమి నిర్మాణ పనులు దాదాపుగా 40 శాతం పూర్తయినట్లు ఇంజనీర్లు వెల్లడించారు. 2024 వరకు అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం 2020లో ప్రధాని నరేంద్ర మోదీ ఆలయం కోసం శంకుస్థాపన చేశారు. ఆలయంలో మొదటి అంతస్తు 2024 వరకు పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గర్భగుడి ప్రాంతం నుంచి ప్రధాన ఆలయ నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఆలయ గోడలకు అవసరమయ్యే పింక్ రాళ్లను రాజస్థాన్ నుంచి తీసుకువస్తున్నారు. గర్భగుడిలోని నిర్మాణాలకు రాజస్థాన్ లోని మక్రానా మార్బుల్ రాళ్లను ఉపయోగించనున్నారు. ఆలయం మొత్తం నిర్మాణం కోసం 8 నుంచి 9 లక్షల క్యూబిక్ ఫీట్ల రాయిని, 6.37 లక్షల క్యూబిక్ ఫీట్ల గ్రానైట్ రాయిని, 4.70 లక్షల క్యూబిక్ ఫీట్ల గులాబీ రాయిని, 13,300 క్యూబిక్ ఫీట్ల మక్రానా తెలుపు మార్బుల్ రాయిని గర్భగుడిలో ఉపయోగించనునన్నారు.

Read Also: Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించిన బైడెన్‌ సర్కార్‌

ఈ ఏడాది జూన్ లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ గర్భగుడికి శంకుస్థాపన చేశారు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల ముందు వరకే గర్భగుడిని భక్తుల కోసం తెరవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని వల్ల బీజేపీకి మరింత మైలెజ్ లభించే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా హిందువులు రాముడి ఆలయం కోసం ఎదురుచూస్తున్నారు. మరో ఏడాదిలో భక్తుల కోరిక తీరే అవకాశం ఉంది. గర్భగుడికి శంకుస్థాపన చేస్తున్న సమయంలో.. యోగీ ఆదిత్య నాథ్ మాట్లాడుతూ..500 ఏళ్లుగా రామ జన్మభూమి కోసం పోరాటం జరిగిందని.. ఇప్పుడు ముగింపు దశగా పయణిస్తోందని..భారతీయులకు గర్వకారణం అని అన్నారు. ఆక్రమణదారులు మన సంస్కృతిపై దాడి చేశారని, కానీ చివరికి భారత్ గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.