ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అనేక కీలక విషయాలను దర్యాప్తు సంస్థలు రాబట్టాయి. ఇక ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్‌ను నవంబర్ 17న పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుళ్ల వెనుక క్రియాశీల సహ-కుట్రదారుడిగా ఇతడేనని కనిపెట్టారు. అంతే కాకుండా దేశ వ్యాప్త పేలుళ్లకు కీలక సూత్రదారుడిగా భావిస్తున్నారు.
డానిష్ డ్రోన్లు నిర్వహించడంలో స్పెషలిస్ట్. ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపించినట్లుగా అదే తరహాలో డ్రోన్ దాడులు చేయాలని కుట్రపన్నినట్లుగా తేలింది. ఈ మేరకు డానిష్‌లో లభ్యమైన ఫొటోలను బట్టి అధికారులు అంచనాకు వచ్చారు.
డానిష్ ఫోన్‌లో డిలీట్ అయిన ఫోల్డర్ నుంచి ఫొటోలు, వీడియోలను అధికారుల బృందం సేకరించింది. ఇందులో డ్రోన్లు, రాకెట్ లాంచర్లు డజన్ల కొద్ది చిత్రాలు, వీడియోలను గుర్తించారు. హమాస్ తరహాలోనే భారత్‌లోనూ దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లుగా కనిపెట్టారు. డ్రోన్లలో పేలుడు పదార్థాలు ఎలా అమర్చాలో కూడా ఒక వీడియో మొబైల్‌లో ఉంది. వీడియోలన్నీ ఒక యాప్ ద్వారా సహచర కుట్రదారులకు పంపినట్లుగా కనుగొన్నారు. యాప్‌లో కొన్ని విదేశీ నెంబర్లు కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక ఉగ్రవాదులు 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల మోడిఫైడ్ డ్రోన్‌లను కూడా తయారు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది.
హమాస్ ఉపయోగించిన గ్లైడింగ్ రాకెట్లపై కూడా ఉగ్రవాదులు పరిశోధనలు చేసినట్లుగా తెలుస్తోంది. డ్రోన్, యాంటీ-డ్రోన్ తయారీ సంస్థ ఇండోవింగ్స్ సీఈవో పరాస్ జైన్ మాట్లాడుతూ.. ఈ రాకెట్లు భూమి నుంచి లేదా చేతితో కూడా విడుదల చేయొచ్చని తెలిపారు. ఇవి తక్కువ ఖర్చుతోనే తయారు చేయొచ్చని చెప్పారు. ఈ రాకెట్‌ను 20 సెకన్లలో ప్రయోగించవచ్చని.. ఒక నిమిషంలో 3 రాకెట్లు వరకు ప్రయోగించొచ్చని పేర్కొన్నారు. హమాస్ పెద్ద మొత్తంలో ఇలాంటి రాకెట్లనే ప్రయోగించిందని.. వేగంగా విధ్వంసాన్ని సృష్టిస్తాయని వెల్లడించారు.
డానిష్ ఎవరు?
డానిష్ డ్రోన్ నిపుణుడు. డ్రోన్లు, రాకెట్లను తయారు చేయడంలో మంచి పట్టు ఉంది. కెమెరాలతో పాటు బరువైన బాంబులను మోసుకెళ్లగల పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన శక్తివంతమైన డ్రోన్‌లను తయారు చేయగల సామర్థ్యం ఉన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. చిన్న, ఆయుధరహిత డ్రోన్‌లను తయారు చేయడంలో మంచి అనుభవం ఉందని తెలిపారు. నవంబర్ 17న శ్రీనగర్‌లో డానిష్‌ను అరెస్టు చేశారు. డాక్టర్ ఉమర్‌తో కలిసి డానిష్ మారణహోమాన్ని సృష్టించాలని ప్లాన్ చేసినట్లుగా అధికారులు కనిపెట్టారు. అల్-ఫలాహ్ యూనివర్సిటీకి డానిష్ పలుమార్లు వచ్చి మాస్టర్ ప్లాన్ వివరించినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది.
