Site icon NTV Telugu

Amit Shah: ‘‘ఔరంగాజేబ్ ఫ్యాన్ క్లబ్’’.. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లపై అమిత్ షా ఫైర్..

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘మహా వికాస్ అఘాడీ’ నేతలపై విమర్శలు గుప్పించారు. ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో పాటు శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహారాష్ట్రలో పర్యటించిన ఆయన శరద్ పవార్‌ని దేశంలో అవినీతి నాయకుడిగా అభివర్ణించారు. పూణేలో జరిగిన బీజేపీ రాష్ట్రు సదస్సులో ప్రసంగిస్తూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 1993 ముంబై వరస పేలుళ్ల దోషి యాకుమ్ మెమన్‌కి క్షమాభిక్ష విషయంలో ఉద్ధవ్ ఠాక్రేని ‘‘ఔరంగజేబ్ ఫ్యాన్స్ క్లబ్’’ అధినేత అంటూ విమర్శించారు.

2014, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ కూటమి మెరుగ్గా రాణిస్తుందని చెప్పారు. శరద్ పవార్ అవినీతిని సంస్థాగతీకరించారని దుయ్యబట్టారు. ఇటీవల ఎన్నికల్లో భారత ప్రజలు ప్రధాని నరేంద్రమోడీకి ఆమోద ముద్ర వేశారని, రాబోయే జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాహుల్ గాంధీ అహంకారాన్ని అణిచివేస్తామని అమిత్ షా అన్నారు.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు..నిరసనకారులకు ఉపశమనం

శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేని తీవ్రంగా విమర్శిస్తూ.. ‘‘1993 ముంబై వరుస పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు క్షమాభిక్ష కోరిన వారితో ఉద్ధవ్ ఠాక్రే కూర్చున్నాడు’’ అని అన్నారు. ఔరంగజేబు అభిమానుల సంఘం ఎవరంటే.. (26/11 ఉగ్రదాడి దోషి) కసబ్‌కు బిర్యానీ వడ్డించే వారు, యాకూబ్ మెమన్ కోసం క్షమాపణ కోరేవారు, (వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు) జకీర్ నాయక్‌కు శాంతి దూతగా చెబుతూ మద్దతు ఇచ్చే వారని అన్నారు. అలాంటి వ్యక్తులతో ఠాక్రే పొత్తు పెట్టుకోవడానికి సిగ్గుపడాలని అని ఘాటుగా విమర్శించారు.

బీజేపీ నాయకులు, శ్రేణులను ఉద్దేశిస్తూ మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూసి భయపడొద్దని, కార్యకర్తలు మంచిగా పనిచేయడం ద్వారా మళ్లీ పుంజుకోవచ్చని అన్నారు. మహారాష్ట్రలో ప్రతీ బీజేపీ కార్యకర్త విజయం కోసం క‌ృషి చేయాలని అన్నారు. మహారాష్ట్రలో మళ్లీ కమలం వికసించాలని చెప్పారు. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే మరింత మెరుగైన ఫలితాలను కనబరుస్తామని చెప్పారు.

Exit mobile version