Site icon NTV Telugu

PM Modi: ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే.. ఇస్రో శాస్ర్తవేత్తలతో ప్రధాని భావోద్వేగం

Pm Modi

Pm Modi

PM Modi Meets ISRO Scientists: చంద్రయాన్‌-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్ర్తవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. చంద్రుడిపై చంద్రయాన్‌-3 విజయవంతంగా అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్‌ స్పేస్‌ డేగా ప్రకటించారు. చంద్రయాన్‌-3ను విజయవంతం చేసిన ఇస్రో శాస్ర్తవేత్తలతోపాటు సిబ్బందిని ప్రధాని మోడీ అభినందించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసి భారత ఖ్యాతిని దశదిశలుగా వ్యాపింప చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని వారిని ప్రధాని మోడీ అభినందించారు. శనివారం ఉదయాన్నే బెంగుళూరులోని హాల్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి నన్ను నేను ఆపుకోలేక నేరుగా బెంగుళూరు వచ్చానని మోడీ అన్నారు. అనంతర బెంగళూరులోని ఇస్రో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు.

Read Also: World Cup 2023 Tickets: అభిమానుల దండయాత్ర.. దెబ్బకు ‘బుక్‌ మై షో’ యాప్‌ క్రాష్‌! భారత్ మ్యాచ్‌ల పరిస్థితి ఏంటో

భారతదేశానికి ఇది సరికొత్త వేకువని ప్రధాని మోడీ కొనియాడారు. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించి ప్రజలను ఉత్సాహపరిచారు. అనంతరం రోడ్ షో నిర్వహించి అక్కడి నుంచి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ మరియు కమాండ్ నెట్‌వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు. తొలుత చంద్రయాన్-3 బృందంతో ప్రధాని ఫోటోలు దిగారు. ఇస్రో శాస్ర్తవేత్తలు కూడా సంతోషంగా ఫోటోలు తీసుకున్నారు. అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ప్రధానికి చంద్రయాన్-3 ప్రయోగంలో చేపట్టిన దశల గురించి వివరించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఇస్రో శాస్ర్తవేత్తలతో మాట్లాడుతూ.. ఈరోజు భారత్ చంద్రుడిపై అడుగు పెట్టింది. భారతదేశం ప్రపంచానికి వెలుగులు విరజిమ్ముతుంది. నేను దక్షిణాఫ్రికాలో ఉన్నా.. నా మనసంతా ఇక్కడే ఉంది. మిమ్మల్ని కలవడానికి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశాను. భారత్ సత్తా ఏంటో ఈ రోజు ఇస్రో ప్రపంచానికి చూపించింది.. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి, నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నాను. చంద్రయాన్-3 విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని కలిగించింది. ఇది మామూలు విజయం కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది. ప్రతీ ఇంటిపైనే కాదు.. చంద్రుడిపై కూడా భారత జెండా ఎగురుతోంది. ఇస్రో సాధించిన విజయం దేశానికే గర్వకారణం. భారతదేశం యొక్క శక్తి సామర్ధ్యాలను ప్రపంచమంతా కీర్తిస్తోంది. ఎవ్వరూ సాధించలేని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారు. దేశాభివృద్ధిలో స్పేస్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. చంద్రయాన్-3 అడుగుపెట్టిన స్థలాన్ని శివశక్తి స్థల్‌గా నామకరణం చేస్తున్నాం. చంద్రయాన్-2 దిగిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్‌గా పేరు పెడుతున్నాం. ఈ ప్రయోగంలో మహిళా సైంటిస్టుల పాత్ర ఎంతో ఉంది. నేడు భారత సాంకేతిక శక్తిని ప్రపంచమంతా చూస్తోంది. అంతరిక్ష రంగంలో భారతదేశం చరిత్ర సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్తలు దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన ఆగస్టు 23ను ఇకపై మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుందామంటూ ప్రధాని మోడీ ప్రసంగించారు.

Exit mobile version