NTV Telugu Site icon

Atul Subhash suicide: రాహుల్ కాన్వాయ్‌ను వెంబడించిన అతుల్ స్నేహితులు.. ప్రతిపక్ష నేత ఏం రిప్లై ఇచ్చారంటే..!

Rahulgandhi

Rahulgandhi

దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కాన్వాయ్‌ను అతుల్ సుభాష్‌ సన్నిహితులు కారులో వెంబడించారు. ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారించినా.. పట్టించుకోకుండా వెంటాడారు. అతుల్ ఫొటో చూపిస్తూ.. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి రాహుల్ స్పందించారు. ఒక చాక్లెట్‌ను వారి మీదకు విసిరారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈనెల 9న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్.. భార్య వేధింపులు తాళలేక బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. 90 నిమిషాల వీడియో మెసేజ్, 40 పేజీల లేఖ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. భార్య నికితా సింఘానియా, అత్త కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులను ప్రస్తావించాడు. హత్య, లైంగిక వేధింపులు, డబ్బు కోసం వేధింపులు, గృహహింస, వరకట్న వేధింపులతో సహా పలు సెక్షన్ల కింద తన భార్య తనపై అనేక కేసులు పెట్టిందని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళల రక్షణకు ఉద్దేశించిన చట్టాలను తప్పుగా ఉపయోగించడంపై చర్చకు దారితీసింది. అయితే ఈ విషాద ఘటనపై ఇప్పటి వరకు ఏ రాజకీయ నేతల నుంచి స్పందన లేదు. అయితే అతుల్‌కు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున నెటిజన్లు.. భార్యను, కుటుంబ సభ్యులను నిందించారు.

అయితే గురువారం ఢిల్లీలో అతుల్ సంతాప సభ జరిగింది. దీనికోసం కొందరు కారులో వెళ్తుండగా.. అదే దారిలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాన్వాయ్ వెళ్తోంది. అతుల్ ఫొటో చూపిస్తూ… న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలను ఆసరాగా చేసుకుని మహిళలు పెడుతున్న వేధింపుల నుంచి విముక్తి కలిగించాలని కోరారు. చట్టాల్లో మార్పులు తీసుకురావాలని కోరారు. పురుషులు మరియు వారి కుటుంబాలను వేధించడానికి ఈ చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొన్నారు. వారి మాటలు విన్న రాహుల్.. కారులోకి చాక్లెట్ విసిరారు. అయితే ఈ కేసుపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.