NTV Telugu Site icon

Rahul Gandhi: “నిందితులను రక్షించే ప్రయత్నం”.. కోల్‌కతా డాక్టర్ ఘటనలో మిత్రపక్షంపై విమర్శలు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ నేతలు మెల్లిగా స్పందిస్తున్నారు. ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించిన ఒక రోజు తర్వాత ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సుతిమెత్తగా విమర్శలు చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘బాధితురాలికి న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే ప్రయత్నం. ఆస్పత్రి, స్థానిక పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘‘మెడికల్ కాలేజీ లాంటి చోట్ల కూడా డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువు కోసం ఎలా బయటకు పంపుతారని ఈ సంఘటన ఆలోచించేలా చేపింది. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను నిరోధించడంలో ఎందుకు విఫలమవుతున్నాయి..? హత్రాస్ నుంచి ఉన్నావ్, కథువా నుంచి కోల్‌కతా వరకు నిరంతరం పెరుగుతున్న మహిళలపై జరుగుతున్న సంఘటనలపై ప్రతీపక్షం, సమాజాంలోని ప్రతీ వర్గం తీవ్రమైన చర్చలు జరపాలి. ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

Read Also: Garlic: వెల్లుల్లి కూరగాయా..? లేదా మసాలా..? దశాబ్ధాల చర్చకు హైకోర్టు పరిష్కారం..

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉండగా, ఆమెపై అత్యాచారం, హత్య జరిగాయి. శుక్రవారం ఉదయం కాలేజీలోని సెమినార్ హాలులో ఆమె మృతదేహం గాయాలతో నగ్నంగా కనిపించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనల్ని పెంచింది. బెంగాల్‌లో తృణమూల్ పాలనపై, మమతా బెనర్జీపై బీజేపీ ఘటన జరిగిన తొలి రోజు నుంచి విమర్శలు గుప్పిస్తోంది.

తాజాగా ఆలస్యమైనా కాంగ్రెస్ ఈ ఘటన గురించి మౌనాన్ని వీడింది. నిన్న ప్రియాంకాగాంధీ ఈ ఘటనను ‘‘హృదయ విదారకంగా’’ అభివర్ణించారు. వేగవంతమైన కఠినమైన చర్యలను తీసుకోవాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి మరియు హత్య హృదయ విదారకంగా ఉంది. పని ప్రదేశంలో మహిళల భద్రత చాలా పెద్ద సమస్య, దీనిపై తీవ్రమైన ప్రయత్నాలు అవసరం. బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం జరగాలి. కఠిన చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.