Site icon NTV Telugu

Manipur Violence: మణిపూర్‌లో పోలీసులపై దాడి.. కొనసాగుతున్న హింసాకాండ

Manipur Violence

Manipur Violence

Manipur Violence: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జాతుల మధ్య హింస కొనసాగుతోంది. గురువారం సాయుధ గుంపు ఏకంగా పోలీసులపైనే దాడి చేసింది. దీంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరు రాష్ట్ర స్థాయి అధికారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఇంఫాల్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మణిపూర్ లో రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణలో అమాయకమైన పౌరులు మరణిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలకు కూడా గాయాలు అవుతున్నాయి. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. జిల్లాలోని ఫూగక్చావో ఇఖై పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫూగక్చావో ఇఖై అవాంగ్ లీకై, తేరాఖోంగ్సాంగ్బి ప్రాంతాల్లో గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలపై అనుమానిత సాయుధ దుండగులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు కూడా కాల్పులు మొదలు పెట్టారు.

Read also: Telangana Congress: జీహెచ్ఎంసీ ఆఫీస్‌ ముందు ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరు రాష్ట్ర స్థాయి పోలీసు అధికారి ఉన్నారని మీడియా ప్రకటించింది. క్షతగాత్రులను బిష్ణుపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇంఫాల్ లోని మరో హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంఫాల్ కు దక్షిణంగా 110 కిలోమీటర్ల దూరంలో, ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సరిహద్దు పట్టణమైన మోరేలో ఓ గుంపు బుధవారం దాదాపు 16 పాడుబడిన ఇళ్లకు నిప్పు పెట్టింది. దీంతో పాటు అటవీ అతిథి గృహాన్ని పాక్షికంగా తగలబెట్టింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని అల్లరి మూకలను చెదరగొట్టారు. అలాగే హీకోల్, ఫూగక్చావో ఇఖై ప్రాంతాల్లో మంగళవారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ విద్యార్థి సహా ముగ్గురు పౌరులు గాయపడ్డారు. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయని, దుండగులను తిప్పికొట్టాయని మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కాంగ్పోక్పీ ప్రాంతంలో భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న రెండు బస్సులకు ఓ గుంపు నిప్పుపెట్టింది. ఈ ఘటనకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే మొదటి 3 నుండి మణిపూర్ లో మైతీ, కుకీ తెగల మధ్య జాతి హింస కొనసాగుతోంది. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50,000 మందికి ప్రజలు నిర్వాసితులయ్యారు. 142 మంది మరణించారు. అనేక ఇళ్లు, గ్రామాలు దహనమైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Exit mobile version