Site icon NTV Telugu

ATM Withdraw: రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!

Atmwithdraw

Atmwithdraw

ఏటీఎం సెంటర్లలో అప్పుడప్పుడు టెక్నికల్ సమస్యలు వస్తుంటాయి. ఏటీఎం కార్డు పెట్టినప్పుడు డబ్బులు రాకుండా నిష్క్రమించాక నగదు వచ్చిన దాఖలాలు ఎదురవుతుంటాయి. కానీ ఆ డబ్బు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంటాయి. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. దీంతో బాధితులు లబోదిబో అంటుంటారు.

ఇక సూరత్‌లో విచిత్రమైన సంఘటన కస్టమర్‌కు ఎదురైంది. సూరత్‌కు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుడు ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ. 10,000 విత్‌డ్రా చేశాడు. కానీ ఏటీఏం సాంకేతిక లోపం కారణంగా నగదు రాలేదు. రసీదు కూడా రాలేదు. కానీ 10, 000 విత్‌డ్రా అయినట్లుగా 2017 ఫిబ్రవరి 18న మెసేజ్ వచ్చింది. దీంతో వినియోగదారుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 2017 ఫిబ్రవరి 21న బ్యాంక్ ఆఫ్ బరోడా డంభల్ శాఖలో లిఖితపూర్వకంగా బాధితుడు ఫిర్యాదు చేశాడు. కానీ బాధితుడి గోడు పట్టించుకున్న నాధుడు లేడు.

ఆర్‌బీఐ, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇక సీసీటీవీ ఫుటేజ్ పొందడానికి ఎస్‌బీఐలో ఆర్‌టీఐ అభ్యర్థనను దాఖలు చేశాడు. అయితే ఏ అధికారి కూడా సమాధానం ఇవ్వలేదు. బాధితుడు లెక్కలేనన్ని ఈ-మెయిళ్లు, అనేక ఫిర్యాదులు చేశాడు. చివరగా డిసెంబర్ 20, 2017న వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా ఆ ఏటీఎం ఎస్‌బిఐకి చెందినదని.. తమ రికార్డుల్లో లావాదేవీ ‘‘విజయవంతంగా’’ కనిపించిందని.. అందువల్ల బ్యాంకు బాధ్యత వహించదని బ్యాంక్ ఆఫ్ బరోడా వాదించింది. అయితే వినియోగదారుల కమిషన్ బ్యాంక్ వాదనను తోసిపుచ్చింది. లావాదేవీకి సంబంధించిన పక్కా రుజువులను బ్యాంకు తప్పనిసరిగా అందించాలని పేర్కొంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని ఐదు రోజుల్లోగా వాపసు చేయాలని ఆదేశించింది. కానీ బ్యాంకు అలా చేయడంలో విఫలం కావడంతో కమిషన్ సీరియస్‌గా తీసుకుంది.

దీంతో అసలు రూ.10,000తో పాటు 9 శాతం వార్షిక వడ్డీతో వాపసు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆలస్యానికి రోజుకు రూ.100 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కూడా సూచించింది. దీంతో 2026 ఫిబ్రవరి 26 నాటికి జాప్యం 3,288 రోజులకు చేరింది. మొత్తం పరిహారం రూ. 3,28,800కు పెరిగింది. ఇక మానసిక వేధింపులకు గాను రూ. 3,000, న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ. 2,000 చెల్లించాలని కూడా బ్యాంకుకు కమిషన్ ఆదేశించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు అసలు మొత్తానికి దాదాపు 30 రెట్లు చెల్లించవలసి వస్తోంది. ఈ సీన్ చూస్తుంటే.. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడమంటే ఇదేనేమో అనిపిస్తోంది.

Exit mobile version