NTV Telugu Site icon

Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం

Delhicmatishi

Delhicmatishi

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా.. అతిషిచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్ నేతలు, తదితరులు హాజరయ్యారు. ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిషి రికార్డు సృష్టించారు. అతిషితో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులుగా సౌరవ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేష్ అలావత్ ప్రమాణస్వీకారం చేశారు.

అతిషి..

పంజాబీ రాజ్‌పుత్ కుటుంబం నుంచి వచ్చిన అతిషి.. జూన్ 8, 1981న జన్మించారు. ఆమె తండ్రి విజయ్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. న్యూ ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత.. అతిషి సెయింట్ స్టీఫెన్ కళాశాల నుంచి పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత ఆమె చెవెనింగ్ స్కాలర్‌షిప్‌పై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అతిషి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి రోడ్స్ స్కాలర్‌గా విద్యా పరిశోధనలో రెండవ మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు.

సామాజిక కార్యకర్తగా ప్రస్థానం..
మాస్టర్స్ అనంతరం ఆమె సామాజిక సేవ వైపు మళ్లారు. మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో ఏడేళ్లు నివసించారు. ఈ కాలంలో ఆమె సేంద్రీయ వ్యవసాయం, ప్రగతిశీల విద్యా విధానంపై పనిచేశారు. వారణాసిలో సామాజిక కార్యకర్తగా కూడా చురుకుగా పనిచేశారు. ఆమె అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి ముందుకు సాగారు. సామాజిక కార్యకర్తగా ఉన్నప్పుడు… ఆమె అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే యొక్క ఉద్యమంతో అనుబంధం పొందారు. పార్టీ ప్రారంభం నుంచి ఆమ్ ఆద్మీతో అనుబంధం కలిగి ఉన్నారు.

ఆప్‌లో ముఖ్యమైన బాధ్యతలు..
ఆమ్ ఆద్మీ పార్టీలో అతిషి చాలా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. 2013లో ఎన్నికల రంగప్రవేశం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి మేనిఫెస్టోను తయారు చేసిన మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. పార్టీ ప్రారంభ రోజుల్లో పార్టీ విధానాలను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా అతిషి పార్టీని ప్రధాన వేదికలపై బలంగా సమర్థించారు. అతిషి జులై 2015 నుంచి ఏప్రిల్ 2018 వరకు విద్యా శాఖలో మనీష్ సిసోడియాకు సలహాదారుగా పనిచేశారు. ఆమె 2015 ఖాండ్వా జల సత్యాగ్రహంలో పాల్గొనడమే కాకుండా చట్టానికి వ్యతిరేకంగా పోరాడారు. 2020 గోవా ఎన్నికలలో.. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు సీట్లు గెలుచుకోవడంలో ఆమె పాత్ర కీలకం. అప్పుడు ఆమె రాష్ట్ర ఇన్‌ఛార్జి బాధ్యతలో కొనసాగారు.

2020లో తొలిసారి ఎమ్మెల్యే..
అతిషి రాజకీయాల్లోకి వచ్చిన చాలా ఏళ్లకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె 2020లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన అతిషి అసెంబ్లీకి చేరుకున్నారు. 2023లో..ఆమెకి మొదటిసారిగా కేజ్రీవాల్ కేబినెట్‌లో స్థానం లభించింది. మనీష్ సిసోడియాతో సలహాదారుగా పనిచేసిన విద్యా శాఖ బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించారు. దాదాపు నెల రోజుల క్రితం..కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం నాడు అతిషి జెండా ఎగురవేయాలని మాజీ సీఎం అరవింద్ ప్రతిపాదించారు. అయితే.. ఆమె ఈ బాధ్యతను కైలాష్ గెహ్లాట్‌కు అప్పగించారు.

కేబినెట్‌లో ముఖ్య స్థానం..
కేజ్రీవాల్ కేబినెట్‌లో అత్యంత ప్రభావంతమైన మంత్రిగా అతిషి ఉన్నారు. మార్చి 9, 2023న ఢిల్లీ ప్రభుత్వ మంత్రిగా ప్రమాణం చేసిన అతిషికి విద్య, పబ్లిక్ వర్క్స్, రెవెన్యూ, వాటర్, ఫైనాన్స్, ప్లానింగ్ వంటి భారీ శాఖలను సీఎం కేజ్రీవాల్ అప్పగించారు. తొలిసారి మంత్రిగా పనిచేసిన 18నెలల తర్వాత ఇప్పుడు ఢిల్లీ సీఎం అయ్యారు.