Site icon NTV Telugu

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ చివరి చూపు కోసం లక్షలాదిగా తరలివచ్చిన అస్సామీయులు.. 25 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

Singer Zubeen Garg

Singer Zubeen Garg

జుబీన్ గార్గ్.. అస్సామీ గాయకుడు. అస్సామీ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది హృదయాలను గెలిచిన గాయకుడు. నిన్నామొన్నటిదాకా అంతగా పరిచయం లేని జుబీన్ గార్గ్. ఆయన మరణం తర్వాత.. ఆయన కోసం తరలివస్తున్న జనాలను చూస్తుంటే.. ప్రజల గుండెల్లో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారో అర్థమవుతోంది. శుక్రవారం సింగపూర్‌లో ఆయన హఠాన్మరణం చెందారని వార్త తెలియగానే ఆయన అభిమానులు, అస్సామీయులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారంటే జుబీన్ గార్గ్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో వేరే చెప్పక్కర్లేదు.

ఇక ఆయన భౌతికకాయం ఆదివారం సింగపూర్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ నుంచి గౌహతికి చేరుకుంది. అనంతరం గౌహతి నుంచి గార్గ్ నివాసమైన కహిలిపారా వరకు వెళ్తున్నప్పుడు లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి పూలవర్షం కురిపించారు. దాదాపు ఇలా 25 కిలోమీటర్ల వరకు దారిపొడవునా అభిమానులు బారులు తీరారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు, యువకులు, మహిళలు, వికలాంగులు రోడ్డు పక్కన నిలబడి పూల వర్షం కురిపించారు, చేతులు జోడించి ప్రార్థన చేశారు. ఆయన నామాన్ని జపించారు. కాన్వాయ్ ముందుకు సాగుతుండగా ఏడుస్తూనే ఉన్నారు. 25 కిలోమీటర్ల ప్రయాణానికి కొన్ని గంటల సమయం పట్టింది అంటే ఏ రేంజ్‌లో ప్రజలు వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గార్గ్‌పై ఇంత ప్రేమానురాగాలు ఉన్నాయా? అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: నేడు అరుణాచల్‌ప్రదేశ్, త్రిపురలో మోడీ పర్యటన

జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణంతో అస్సాం రాష్ట్ర ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణవార్త తెలియగానే అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. స్వచ్చంధంగా దుకాణాలు మూతపడ్డాయి. ప్రజా సేవలు ఆగిపోయాయి. జనాలు వీధుల్లోకి వచ్చి కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అస్సాం సాంస్కృతి చిహ్నం ఆగిపోయిందని దు:ఖిస్తున్నారు. ‘‘యా అలీ’ పాటతో యావత్తు దేశాన్ని ఆకట్టుకున్నారు. ఇక ఆయన వార్త తెలియగానే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అస్సాం స్వరం మూగబోయిందని అభివర్ణించారు.

ఇది కూడా చదవండి: Darshana: భాష తెలియకపోయినా.. మంచి కథ ఉంటే చేసేస్తా: దర్శన

జుబీన్ గార్గ్ 40 భాషల్లో పాడారు. 38,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అస్సాం సాంస్కృతిని పరిచయం చేశారు. ఇక గార్గ్ మృతి పట్ల అస్సాం ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఇక ఆయన అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని, స్మారక చిహ్నాన్ని అస్సాం మంత్రివర్గం ఖరారు చేస్తుందని భావిస్తున్నారు. గౌహతి సమీపంలోని సోనాపూర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గార్గ్ అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 23న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం ప్రకటించారు. భారీ సంఖ్యలో నివాళులర్పించడానికి ప్రజలు తరలిరావడంతో అంత్యక్రియల కోసం మరో రోజు పొడిగించాల్సి వచ్చింది.

జుబీన్ గార్గ్ సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం బోటుపై షికారు చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. బోటులోంచి లైఫ్ జాకెట్ ధరించి నీళ్లకు దూకి ఈత కొట్టడం ప్రారంభించారు. కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. కొద్దిసేపటికే ఆయన స్పృహ కోల్పోయారు. కొద్దిసేపు నీళ్లలోనే శవంలా ఉండిపోయారు. అనంతరం సహచరులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మరణ వార్త తెలియగానే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. జుబీన్ గార్గ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.

Exit mobile version