Assam Shocker: అస్సాంలో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో నిందితుడు రామానుజ్ గోస్వామి మృతి చెందాడు. తన భార్య రియా తాలూక్దార్‌ను దారుణంగా హత్య చేసి, ఆమె తలను ఫ్రిజ్‌లో పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామానుజ్.. సోమవారం తెల్లవారుజామున పోలీస్ వాహనం నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. రామానుజ్‌ను వైద్య పరీక్షల కోసం గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా నరకాసుర కొండ సమీపంలో ఈ ఘటన జరిగింది. కదులుతున్న పోలీస్ వాహనం నుంచి అతడు ఒక్కసారిగా దూకడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. రామానుజ్‌కు విధించిన ఏడు రోజుల పోలీస్ రిమాండ్ ఆదివారం ముగిసింది. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
భార్యను హత్య చేసి తలను ఫ్రిజ్‌లో పెట్టినట్లు ఆరోపణలు
రామానుజ్ గోస్వామి, రియా తాలూక్దార్‌ల వివాహం గత ఏడాది సెప్టెంబర్ 22న జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం రియా వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వివాదం ముదరడంతో రామానుజ్ తన నియంత్రణ కోల్పోయి రియాను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా ఆమె తలను శరీరం నుంచి వేరు చేసి ఫ్రిజ్‌లో దాచినట్లు కేసు నమోదైంది. రామానుజ్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ దంపతులు గువాహటిలోని బెల్టోలా ప్రాంతం బశిష్ఠపూర్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌లో నివసించేవారు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన
దారుణ హత్య జరిగిన మూడు రోజుల తర్వాత, సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి రామానుజ్ స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అదే రాత్రి పోలీసులు అతడు నివసిస్తున్న ఫ్లాట్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అక్కడ మహిళ మృతదేహం మొండెం, కత్తిరించిన తలను స్వాధీనం చేసుకున్నారు.
‘నేను చేసిన పనికి పశ్చాత్తాపం లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు
పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో సెప్టెంబర్ 8న వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా రామానుజ్ మీడియాతో మాట్లాడాడు. తాను చేసిన హత్యపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని అతడు పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాదు.. జైలు నుంచి బయటకు వస్తే తన భార్యతో సంబంధం ఉందని అనుమానించిన ‘షుగర్ డ్యాడీ’ని కూడా చంపుతానని బహిరంగంగా బెదిరించినట్లు తెలుస్తోంది.
నిందితుడికి మాదకద్రవ్యాల అలవాటు?
పోలీసు వర్గాల ప్రకారం.. రామానుజ్‌కు మాదకద్రవ్యాల అలవాటు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గువాహటి శివార్లలో ఉన్న ఓ నశా విముక్తి కేంద్రంలో అతడికి గతంలో పలుమార్లు చికిత్స కూడా జరిగినట్లు సమాచారం. అయితే, ఈ కేసులో పూర్తి వివరాలు, నిందితుడి మృతికి సంబంధించిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

