NTV Telugu Site icon

Assam Floods: అస్సాంలో భారీ వరదలు… ఆరు జిల్లాలపై ఎఫెక్ట్

Assam

Assam

అకాల వర్షాలు అస్సాంను ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల అస్సాంలోని 6 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించాయి. వాగులు, నదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరుగిపడుతున్నాయి. ఈ ఏడాదిలో తొలిసారి అస్సాంను వరదలు ముంచెత్తాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నిన్న డిమా హసావో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. డిమా హసావో జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. హప్లాంగ్ ప్రాంతంలో దాదాపుగా 80 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దిమా హసావో జిల్లాలో కొండచరియలు విరిగిపడటం వల్ల ఒక మహిళ సహా ముగ్గురు మరణించినట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.

అస్సాంలో ఇప్పటి వరకు కాచర్, దేమాజీ, హోజాయ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, నాగావ్, కమ్రూప్  ఈ ఆరు జిల్లాలు వరదల వల్ల ప్రభావితం అయ్యాయి. ఆరు జిల్లాల్లోని 94 గ్రామాలకు చెందిన 24,681 మంది ప్రభావితం అయ్యారు. ఒక్క కాచర్ జిల్లాలోనే 21,000 మంది వరద బారిన పడ్డారు.  హోజాయ్, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాను కలిపే రహదారి వరదల్లో కొట్టుకుపోయింది.

అస్సాంతో పాటు సమీపంలో ఉండే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ జిల్లాల్లో కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. పలు నదులు ప్రమాద తీవ్రతను మించి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొపిలి నది నది ప్రవాహ తీవ్రత ప్రమాద స్థాయిని దాటింది. ఆర్మీ, పార మిలటరీ, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ ఎమర్జెన్సీ టీములు రెస్క్యూను కొనసాగిస్తున్నాయి. శనివారం కాచర్ జిల్లాలో 2150 మందిని రెస్క్యూ చేశాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, కరెంట్ పోల్స్ కొట్టుకుపోయాయి.

Show comments