NTV Telugu Site icon

Asaduddin Owaisi: గుజరాత్ అల్లర్లు.. అమిత్ షా కామెంట్‌కి ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్

Owaisi Counter To Amit

Owaisi Counter To Amit

Asaduddin Owaisi Strong Counter To Amit Shah: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఆ రాష్ట్రంలో జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు సంధించుకుంటున్నారు. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. సరికొత్త వివాదాలకూ తెరలేపుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రచారంలో భాగంగా ఆయన 2002 గుజరాత్ అల్లర్ల విషయాన్ని తిరిగి తెరమీదకి తీసుకురావడమే అందుకు కారణం.

గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. గోద్రా అల్లర్ల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో గుజరాత్‌లో తరచూ మతోన్మాద దాడులతో పాటు అల్లర్లు జరిగేవని ఆరోపించారు. అందుకే 2002 అల్లర్లు జరిగాయని పేర్కొన్నారు. అయితే.. ఆ అల్లర్లకు కారణమైన వారికి ఆనాడే బీజేపీ గుణపాఠం చెప్పిందన్నారు. బీజేపీ చెక్ పెట్టడం వల్లే.. సంఘవిద్రోహ శక్తులు హింసా మార్గాన్ని వదిలిపెట్టాయన్నారు. మతపరమైన హింసలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుని, గుజరాత్‌లో శాశ్వత శాంతిని బీజేపీ స్థాపించిందని అమిత్ షా తెలిపారు. ఈ విధంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒవైసీ.. ‘‘2002లో మీరు ఏం పాఠం నేర్పించారు? బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి వదిలిపెట్టాలనే గుణపాఠమా? బిల్కిస్ బానో మూడేళ్ల కూతురు హంతకులకు విముక్తి ప్రసాదించాలని నేర్పించారా? ఎహెసాన్ జాఫ్రీని చంపేశారు. ఇలా మీరు నేర్పిన పాఠాల్లో ఏది గుర్తుంచుకోవాలి? గుణపాఠం చెప్పాంటున్న హోంమంత్రి.. ఢిల్లీ మతకల్లోలాలు జరిగినప్పుడు ఏ పాఠం నేర్పారు?’’ అంటూ నిలదీశారు. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదని, ఏదో ఒక రోజు అధికారం మారుతుందన్నారు. అధికారంలో ఉన్నారనే భావనతోనే అమిత్‌ షా ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నారని ఒవైసీ విమర్శించారు.