NTV Telugu Site icon

Asaduddin Owaisi: జ్ఞానవాపిపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ మౌనం ఎందుకు..?

Aimim Chief Asasaduddin

Aimim Chief Asasaduddin

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదుపై రచ్చ నడుస్తోంది. వారణాసి కోర్ట్ మసీదు వీడియోగ్రఫీకి అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. ఓ వర్గం వారు కోర్ట్ ఆదేశాలను వ్యతిరేఖిస్తున్నారు. మసీదు మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసి ఈనెల 17న రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోర్ట్ కమిషనర్ ను ఆదేశింది.  మసీదు వెలపల గోడపై హిందూ దేవత విగ్రహాలు ఉన్నాయని.. మాకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించడంతో కోర్ట్ వీడియోగ్రఫీకి ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే జ్ఞానవాపి చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది.

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోర్ట్ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నారు. గతంలో బాబ్రీని వదులుకున్నాం… మళ్లీ జ్ఞానవాపిని వదులుకోవడానికి సిద్ధంగా లేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు రాజకీయ విమర్శలు చేశారు. జ్ఞానవాపి విషయంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయంటూ నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఎస్పీ పార్టీలు మతోన్మాద పార్టీలని విమర్శించారు. ముస్లింలు ఇళ్లలోనే ముస్లింలుగా ఉండాలని.. బయటకు వస్తే వారి పార్టీల సంస్కృతిని అంగీకరించాలని వారు కోరుకుంటున్నారని అసదుద్దీన్ విమర్శించారు.

రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ద్వారా మేం మా సంస్కృతిని కొనసాగిస్తామని అన్నారు. బాబ్రీ మసీదును కుతంత్రం ద్వారా న్యాయాన్ని హత్య చేయడం ద్వారా లాక్కున్నారని.. మళ్లీ జ్ఞానవాపిని కోల్పోమని చెప్పడానికే ఇక్కడ ఉన్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థన స్థలంలోని మతపరమైన స్వభావం మారదని.. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం చెబుతోందని.. దాని స్వభావాన్ని మార్చేందుకు ప్రయత్నించే వారికి మూడేళ్లు శిక్ష విధించ వచ్చని ఓవైసీ అన్నారు.