ఒమిక్రాన్ కరోనా వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో వచ్చే ఏడాది దేశంలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్థత నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కావడంతో ఎన్నికలు వాయిదా పడతాయని అందరూ భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం చర్చించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ భావిస్తోంది.
Read Also: జనవరిలో 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. వివరాలు ఇవిగో..
మంగళవారం యూపీలో పరిస్థితిని కేంద్ర ఎన్నికల అధికారులు సమీక్షించనున్నారు. ఎన్నికల వేళ రక్షణ కల్పించే పారామిలటరీ దళాల చీఫ్‌లతో సమావేశమై ఎన్నికల అధికారులు సమాలోచనలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోవైపు వచ్చే ఏడాది జనవరి 22న మరోసారి కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశం కానున్నారు. కాగా ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
