Site icon NTV Telugu

Devendra Fadnavis: రాజీనామాకు సిద్ధమైన ఫడ్నవీస్.. అమిత్ షా ఏం చెప్పారంటే..

Amit Shah Fadnavis

Amit Shah Fadnavis

Devendra Fadnavis: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ దారుణ ఫలితాలు తెచ్చుకుంది. 48 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రంలో బీజేపీ 09 స్థానాలకు పరిమితమైంది. ఎన్డీయే కూటమి మొత్తంగా 17 స్థానాలను గెలుచుకుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఏకంగా 30 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఘోర పరాజయం తర్వాత, ఈ ఫలితాలకు తానే బాధ్యత వహిస్తున్నట్లు బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. తాను డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. పార్టీ బలోపేతానికి పనిచేస్తానని అన్నారు. ఎక్కడ తప్పుజరిగిందో చూసుకుని, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటానని చెప్పారు.

Read Also: Teachers Transfers: గుడ్ న్యూస్.. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల..

అయితే, దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా వ్యవహారంలో అమిత్ షా జోక్యం చేసుకున్నారు. ఫడ్నవీస్‌తో మాట్లాడిన షా, ప్రభుత్వంలో కొనసాగాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం ఎన్డీయే సమావేశం ముగిసిన తర్వాత సీఎం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, ఫడ్నవీస్ రాష్ట్రంలో పరిస్థితులపై అమిత్ షాతో చర్చించారు. ఈ సమావేశంలోనే ఫడ్నవీస్ రాజీనామా అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ భేటీ అనంతరం ఫడ్నవీస్, అమిత్ షా నివాసంలో కలిశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయడంతో పాటు రాష్ట్రంలో బీజేపీని మరింత బలపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అమిత్ షా, ఫడ్నవీస్‌కి సూచించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ‘‘మీరు రాజీనామా చేస్తే బీజేపీ కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి రాజీనామా చేయకండి’’ అంటూ షా, ఫడ్నవీస్‌తో చెప్పారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగనున్న ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం తర్వాత వివరంగా చర్చిస్తానని చెప్పారు.

Exit mobile version