Arvind Panagariya: నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగఢియా 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా నియమితులయ్యారు. రిత్విక్ రంజనం పాండే కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో పనగఢియా ఫైనాన్స్ కమిషన్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఈ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ నుంచి ఐదేళ్ల కాలానికి సంబంధించి రూపొందించే నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పించనుంది.
Read Also: New Year 2024: న్యూఇయర్‌లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్, కిరిబాటి.. ఏ దేశంలో ఎప్పుడంటే?
ఫైనాన్స్ కమిషన్ కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై సూచనలు చేసే రాజ్యాంగబద్ధ సంస్థ. ఇందులో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి మిగతా సభ్యులు వివారాలు వెల్లడి కావాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘానికి ప్రస్తుతం ఎన్‌కే సింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పనగఢియా భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆర్థికవేత్తగా పేరొందారు. ఈయన నలంద విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ)కి చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేశారు. ఇంతే కాకుండా వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి ప్రపంచస్థాయి సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి)లో సభ్యుడిగా ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) గవర్నర్ల బోర్డు సభ్యునిగా కూడా పనిచేశారు.
