Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..

  • సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న అరవింద్ కేజ్రీవాల్..
  • దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్ రావాలని పిలుపు..
Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 10న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు తన కుటుంబంతో పాల్గొంటున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు జంతర్ మంతర్ చేరుకోవాలని కేజ్రీవాల్ కోరారు. ఇది ఏ ఒక్క వ్యక్తి, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు.

కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తూ.. బీజేపీకి ఓటు వేయని వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించి, నకిలీ ఓట్లను చేర్చుతున్నారని ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ హయాంలో ఈ వ్యవహారం జరుగుతోందని విమర్శించారు. దేశ ప్రజలు జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతున్నారని కేజ్రీవాల్ అన్నారు.

ఇదిలా ఉంటే, మరోవైపు నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హైఅలర్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే సీజేపీ నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు మెట్రో రైల్ స్టేషన్లు మూసేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఢిల్లీకి వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉందని పోలీసులు తె లిపారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.