NTV Telugu Site icon

Arvind Kejriwal: ఢిల్లీ, పంజాబ్ మాదిరి.. గుజరాత్‌లోనూ అంచనాలు రిపీట్

Kejriwal In Gujarat

Kejriwal In Gujarat

Arvind Kejriwal Says AAP Will Definitely Win In Gujarat Assembly Elections: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలవడం ఖాయమని.. ఢిల్లీ, పంజాబ్‌ మాదిరిగానే గుజరాత్‌ విషయంలోనూ అంచనాలు నిజమవుతాయని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి తమ పార్టీ గుజరాత్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. జనవరి 31 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అధికార బీజేపీకి భయపడి.. ఆప్‌కు ప్రజలు బహిరంగంగా మద్దతు తెలిపేందుకు భయపడుతున్నారన్నారు. 27 ఏళ్ల బీజేపీ పాలనపై ప్రజలకు విరక్తి కలిగిందని, ఆ పార్టీ అభ్యర్థులకు విశ్రాంతి ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.

పాత పింఛను విధానాన్ని(ఓపీఎస్‌) అమలు చేయాలని ప్రభుత్వం ఉద్యోగులందరూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నోసార్లు ఆందోళన చేపట్టారని.. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా వ్యవహరించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈసారి ఆప్‌ అధికారంలోకి వస్తే.. వచ్చే ఏడాది జనవరి నుంచే పాత పింఛను విధానాన్ని అమలు చేస్తామని, ఇది కేవలం మాటలకే పరిమితం కాదని, పంజాబ్‌లో ఇప్పటికే ఈ విషయమై నోటిఫికేషన్ విడుదల చేశామని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన.. పార్టీని గెలిపించేందుకు ఉద్యోగులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామేమోనన్న భయం బీజేపీని చుట్టుముట్టిందని, ఇక కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన ప్రజల్లో లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. 27 ఏళ్ల తర్వాత గుజరాత్‌ ప్రజలు బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి కాబోతున్నారని చెప్పారు.

27 ఏళ్లలో తొలిసారి బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అనుమానం ఉంటే ప్రజలనే అడిగి తెలుసుకోవాలని కేజ్రీవాల్ తెలిపారు. ఎవరికి ఓటేస్తారని అడిగితే.. ఆప్‌కే వేస్తామని గుజరాత్ ప్రజలు కచ్ఛితంగా చెప్తారన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించామని.. కానీ గుజరాత్‌లో వస్తున్నంత స్పందన మరెక్కడ రాలేదని పేర్కొన్నారు.