Site icon NTV Telugu

మాస్క్‌ ధరిస్తున్న వారు 2శాతమేనా..?

కరోనా ఫస్ట్‌, రెండో వేవ్‌ దేశాన్ని ఎంతగా వణికించిందో అందరూ మర్చిపోయారు. మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం 2శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు మాస్కు ధరించటం లేదనిఈ సర్వే తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే మాస్క్‌ పెట్టుకునేవారి సంఖ్య సెప్టెంబర్‌లో 29శాతం పడిపోయిందని తెలిపింది. కరోనా వైరస్‌లలో అత్యంత వేగంగా వ్యాపించే లక్షణమున్న ఒమిక్రాన్‌ వైరస్‌ బయటపడినవేళ ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 364 జిల్లాల్లో 25వేల మంది నుంచి వివరాలు సేకరించారు. ”మీ ప్రాంతంలో బయట తిరుగుతున్నవారిలో ఎంతమంది మాస్క్‌లు పెట్టుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో వచ్చిన సమాధానాల్ని క్రోడీకరించగా, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సరైన పద్ధతిలో మాస్క్‌లు ధరిస్తున్నవారు కేవలం 2శాతం మందే ఉన్నారు. ఎక్కడా ఎవరూ మాస్క్‌లు పెట్టుకోవటం లేదని సర్వేలో పాల్గొన్న 8 శాతం మంది చెప్పారు. దేశంలో ఇప్పటికే 21 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మాస్క్‌లు ధరించటం లేదని వచ్చిన సమాధానం తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తుంది. 5శాతం మంది మాస్క్‌ల్ని సరిగ్గా ధరిస్తున్నారు. సరిగ్గా ధరించనివారు 38శాతం మంది ఉన్నారు. ఏ తరహా మాస్క్‌లు ధరిస్తున్నారన్న ప్రశ్నకు, 63శాతం మంది బట్టతో చేసిన మాస్క్‌లు ధరిస్తున్నామని చెప్పారు. 21శాతం మంది ఒకసారి వాడిపడేసేవి, ఎన్‌-95 మాస్క్‌లు 8శాతం మంది, కెఎన్‌-95, డబ్ల్యూ-95 తరహా మాస్క్‌ల్ని 3శాతం మంది వాడుతున్నారని ఈ సర్వేలో తేలింది.

ఏది ఏమైనా మాస్క్‌లు ధరించడం అసరమని ఇప్పటికే ప్రభుత్వం మాస్క్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా విధించిన విషయం తెల్సిందే.. స్వీయ రక్షణే ఈ వైరస్‌ నుంచి కాపాడుతుందని వైద్యులు పదేపదే చెబుతున్నా ప్రజల్లో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. ఇప్పటికైనా స్వీయ రక్షణ జాగ్రత్తలు పాటించకున్నా, మాస్క్‌లు ధరించకుంటే మరోసారి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version