Supreme Court: అత్యాచార వీడియోల వ్యాప్తికి సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు బుధవారం మూసివేసింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ, అత్యాచార ఘటనకు సంబందించిన వీడియోల వ్యాప్తి కట్టడి చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు సుప్రీంకోర్టు గుర్తించింది. దీంతో అందుకు సంబంధించి దాఖలైన పిల్‌ను మూసివేసింది. సామాజిక మాధ్యమాల్లో చిన్నారులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు (Child Pornography), అత్యాచార వీడియోల వ్యాప్తిని నియంత్రించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) మూసివేసింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. వీడియోల వ్యాప్తి కట్టడి చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే ఈ కేసులో విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది. వాట్సప్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో ఛైల్డ్ పోర్నోగ్రఫీ, అత్యాచార ఘటనల వీడియోలు విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతుండటంపై ‘ప్రజ్వల’ అనే స్వచ్ఛంద సంస్థ 2015లో అప్పటి సీజేఐ హెచ్‌ఎల్ దత్తుకు లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా పిల్ దాఖలు చేసి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే వీడియోల వ్యాప్తిని కట్టడి చేసేలా తగిన చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చర్యలను ఎప్పటికప్పుడు న్యాయస్థానం పరిశీలించింది.
Read also: Karumuri Nageswara Rao: రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడు..
ఈ కమిటీలో ఫేస్‌బుక్, వాట్సప్ సహా సామాజిక మాధ్యమాల ప్రతినిధులు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం డైరెక్టర్ జనరల్, సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇటీవల తమ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. దీన్ని పరిశీలించిన జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన డివిజన్ బెంచ్.. ఈ విస్తృతమైన అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. వీడియోల వ్యాప్తి కట్డడికి తీసుకుంటున్న చర్యల్లో గణనీయమైన పురోగతి ఉందని పేర్కొంది. చర్యల అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలను మాత్రమే పరిశీలించాల్సి ఉందని, అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని వెల్లడించింది. ఈ అంశాన్ని కోర్టు పరిశీలించిన అవసరం లేదని పేర్కొన్న ధర్మాసనం.. పిల్ విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ చర్యల అమలు తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే.. అప్పుడు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.
