NTV Telugu Site icon

Petrol-diesel Rates: పెట్రోల్-డీజిల్ రేట్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ..

Petrol Rates

Petrol Rates

Petrol-diesel Rates: పెట్రోల్-డీజిల్ రేట్లతో అల్లాడుతున్న జనాలకు కేంద్రం ఇటీవల తీపి కబురు చెప్పింది. లీటర్‌పై రూ.2 తగ్గించింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎంత తగ్గించినా, రేట్లు మాత్రం ఇంకా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనే ఇంధన ధరలు ఎక్కువగా ఉండగా.. అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులు లేదా వాట్ ఆధారంగా ఈ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 కన్నా ఎక్కువగానే ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.87 కాగా.. లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్న కేరళలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.54గా ఉంది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో రూ. 107.39గా ఉంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రూ. 106.45గా, జేడీయూ-బీజేపీ అధికారంలో ఉన్న బీహార్‌లో రూ.105.16గా, రాజస్థాన్ లో రూ. 104.86 గా, మహారాష్ట్రలో రూ. 104.19 గా పెట్రోల్ ధరలు ఉన్నాయి. టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.93గా, ఒడిశాలో రూ. 101.04, తమిళనాడులో రూ. 100.73గా, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 100.37గా రేట్లు ఉన్నాయి.

Read Also: Revanth Reddy: ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆఫర్ ఇచ్చా.. కేసీఆర్ తో చేరితే సమాధానం చెప్పుకోవాలి..!

దేశవ్యాప్తంగా పరిశీలిస్తే కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత చౌకగా పెట్రోల్ లభిస్తోంది. ఇక్కడ ధర రూ. 82 కాగా, సిల్వాస్సా-డామన్‌లో లీటర్ ధర రూ. 92.38, రూ. 92.49గా ఉంది. ఢిల్లీలో రూ. 94.76, పనాజీ రూ. 95.19, అస్సాంలో రూ. 96.12గా రేట్లు ఉన్నాయి. డీజిల్ రేట్ల విషయానికి వస్తే ఏపీలో లీటర్ రూ. 97.6, కేరళలో రూ. 96.41, తెలంగాణలో రూ. 95.63గా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లలో ఇంధన ధరల రేంజ్ లీటర్‌కి రూ. 92-93 ఉంది. ఒడిశా, జార్ఖండ్‌లతో కూడా ఇదే రేంజ్ ఉంది.

గత మూడు త్రైమాసికాలుగా ఇంధన రిటైలర్లు లాభాలను గడిస్తున్నాయి. దీంతో ఇంధన ధరల్ని తగ్గించారు. లోక్‌సభ ఎన్నికల వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.