NTV Telugu Site icon

Mastan Vali: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా

Mastan Vali Special Status

Mastan Vali Special Status

AP Congress Working President Mastan Vali Talks About Special Status: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపిక అవ్వడంతో.. ఏపీ, దేశంలో కాంగ్రెస్ బలపడుతుందని నమ్మకం వెలిబుచ్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఏపీలో మంచి స్పందన వచ్చిందన్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు.. ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు. విభజన హామీల కోసం వైసీపీ ఎంపీలు ఇప్పుడు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరచించారు. ఇదే సమయంలో.. ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై మస్తాన్ వలి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాహుల్ గాంధీ గురించి కొడాలి నాని మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. కొడాలి నాని నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబమన్నారు. మంచి ఆలోచనతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుంటే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడ్డం తగదని అన్నారు. జగన్‌ని అడిగితే కొడాలి నానికి రాహుల్ గాంధీ ఎవరో తెలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కొడాలి నానికి లేదని తేల్చి చెప్పారు. ఇక బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు భారత్ ఐక్యతగా ఉండాలనే ఆలోచన లేదని, దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న జోడో యాత్రకి ప్రజల మద్దతు పెరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ బలహీన పడుతుందంతుని భావించిన ప్రాంతీయ పార్టీలకు.. జోడో యాత్రతో భయం పట్టుకుందని మస్తాన్ వలి చెప్పారు.