Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?

  • అన్నామలై రాజీనామా వార్తలతో రాజకీయాల్లో కలకలం
  • ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో కీలక భేటీ
  • అన్నాడీఎంకే పొత్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అన్నామలై
  • ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదని వర్గాల సమాచారం
Annamalai

Annamalai

Annamalai: అన్నామలై వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని బీజేపీ గానీ, అన్నామలై కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఆయన పార్టీలో ఉన్నారా? బయటకు వెళ్లారా.? అనేది ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ వైఖరి పట్ల కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ వెళ్లిన అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లతో సహా బీజేపీ అగ్ర నాయకులను కలిశారు.

అన్నామలై అసంతృప్తితో ఉన్నప్పటికీ ఇంకా రాజీనామా చేయలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం పార్టీ అగ్రనేతల్ని కలిసిన అన్నామలై, తమిళనాడులో బీజేపీ పనితీరుపై తనకు ఉన్న అభ్యంతరాలను వారికి వివరించారు. ఇటీవల ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు వల్ల పార్టీ భవిష్యత్తుపై ప్రభావం పడినట్లు తెలిపారు. బీజేపీ సొంతంగా బలం పెంచుకోవాలని అన్నామలై తొలి నుంచి వాదిస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తుపై ఆయన అయిష్టంగానే ఉన్నారు. తమిళనాడు ఎన్నికలకు ముందు పొత్తు కుదరాలంటే అన్నామలైని బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే షరతు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది.

×
×
Ad

ఇదే సమయంలో కొంత మంది బీజేపీ, అన్నాడీఎంకే నాయకుల వైఖరి పట్ల అన్నామలై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన లేవనెత్తిన అంశాలను రాష్ట్ర నాయకులతో చర్చిస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం సమావేశంలో అన్నామలై రాజీనామా అంశంపై చర్చ జరగలేదని తెలుస్తోంది. తమిళనాడులో ప్రజా సంబంధ కార్యక్రమాలను ప్రారంభించేందుకు అన్నామలై చేస్తున్న ప్రణాళికలకు సహకరిస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అన్నామలై లేవనెత్తిన విషయాలను చర్చించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్‌ను ఢిల్లీకి పిలిపించారు.