Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్‌పై అన్నామలై ఫైర్

  • తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు..
  • సీఎం విజయ్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు..
  • సెలబ్రేషన్ మోడ్ నుంచి బయటకు రావాలని అన్నామలై ఫైర్..
Annamalai

Annamalai

Annamalai: తమిళనాడులో జంట హత్యలు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఇద్దరు చిన్నారుల హత్యలతో సీఎం విజయ్ సర్కార్ తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే రాష్ట్రంలో శాంతిభద్రతల పరీక్షను ఎదుర్కొంటున్నారు. మదురై మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేయడం, కోయంబత్తూర్‌లో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య సంఘటనలు రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ నేత అన్నామలై టీవీకే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సెలబ్రేషన్ మోడ్ నుంచి బయటకు రావాలని అన్నారు. ‘‘డ్రగ్ మాఫియా, లైంగిక నేరస్తులు, హంతకులకు తమిళనాడులో ఫ్రీ పాస్ లభించింది. గత ప్రభుత్వాల నుంచి పాఠాలు నేర్చుకోని పోలీస్ వ్యవస్థ, సంబరాలలో ఉన్న టీవీకే ప్రభుత్వం ప్రజల భద్రతపై దృష్టిపెట్టడం లేదు’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇదే విషయంపై ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇది తమిళనాడా? లేక ఉత్తర్ ప్రదేశా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన విజయ్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి కూడా టీవీకే సర్కార్‌ను తీవ్రంగా విమర్శించారు. మహిళలు, బాలికల భద్రతపై విజయ్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. పిల్లల కోసం భావోద్వేగ ప్రసంగాలు చేసిన విజయ్ ఇప్పుడు ఈ ఘటనలను చూసి ప్రేక్షకుడిగా మారిపోయారని అన్నారు.

ఇదిలా ఉంటే కోయంబత్తూర్ అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్ర పరిశ్రమల మంత్రి కీర్తనా స్పందించిన తీరుపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రశ్నలకు నవ్వుతూ స్పందించారని బీజేపీ ఆరోపించింది. పోలీస్ ప్రెస్‌మీట్‌లో మహిళా ఉన్నతాధికారి నవ్వుతుండటంపై కూడా విమర్శలు దారి తీసింది. మరోవైపు, సీఎం విజయ్ డ్యామెజ్ కంట్రోల్ చేపట్టారు. ఇటీవల తూత్తుకుడి లో జరిగిన పోక్సో కేసులో విచారణ మూడు నెలల్లోనే పూర్తి చేసి, నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు తీర్పును ఆయన ప్రస్తావించారు. మహిళలు, పిల్లల రక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.