NTV Telugu Site icon

H3N2 Influenza A Virus: కలవరపెడుతోన్న H3N2 వైరస్.. ఏపీ, తెలంగాణ అప్రమత్తం..

H3n2

H3n2

H3N2 Influenza A Virus: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి మర్చిపోకముందే, మరో కొత్త వైరస్ దేశాన్ని కలవరపెడుతోంది. H3N2 వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ ఫ్లూ లక్షణాలున్న రోగుల సంఖ్య పెరుగుతుండటంతో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. దేశంలో H3N2 వైరస్ టెన్షన్ పెరుగుతోంది. రెండు, మూడు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తొలిసారిగా రెండు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక, హర్యానాల్లో కొత్త వైరస్‌తో ఇద్దరు చనిపోయారు. కర్నాటక సైతం H3N2 మరణాన్ని ధ్రువీకరించింది. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.

Read Also: Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. కొత్త ట్విస్ట్‌లు.. ఊహకు అందని పరిణామాలు..!

తెలుగు రాష్ట్రాల్లోనూ H3N2 వైరస్ కలవరం పెడుతోంది. ఫీవర్ హాస్పిటల్స్ సహా అన్ని ఆస్పత్రులూ కిటకిటలాడుతున్నాయి. కరోనా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో.. అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 100కి పైగా హెచ్‌3ఎన్‌2 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఫ్లూ లక్షణాలున్నవారు బయటకు తిరగొద్దని సూచిస్తున్నాయి. అలాంటి సింప్టమ్స్ వున్న పిల్లలను కూడా స్కూల్ కు పంపొద్దని చెబుతున్నాయి.