Bihar: బీహార్ రాజకీయాల్లో అనంత్ సింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జేడీయూ నుంచి అనంత్ సింగ్‌ను ఆరేళ్ల పాటు బహిష్కరించారు. మోకామా ఎమ్మెల్యే అయిన అనంత్ సింగ్ పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, అగ్రనాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడని పార్టీ అతడిని బహిష్కరించింది. అయితే, తనను వెళ్లగొట్టడంపై తనకు ఎలాంటి విచారం లేదని, మరో పార్టీలో చేరే బదులుగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని అనంత్ సింగ్ ప్రకటించారు. పాట్నాలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. జేడీయూ ప్రస్తుత నాయకత్వానికి సొంతంగా రాజకీయాల్లో బలం లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జేడీయూ 10 సీట్లు గెలవడం కూడా కష్టమే అని అన్నారు.
జేడీయూ నితీష్ కమార్ స్థాపించిన పార్టీ అని, ఆయనే పార్టీకి ప్రధాన నాయకుడని, ఇప్పుడు ఆయన లేకుండా పార్టీకి ప్రాధాన్యం ఏముంటుందని ప్రశ్నించారు. జేడీయూ నాయకత్వంపై విమర్శలు చేసినప్పటికీ, నితీష్ కుమార్‌తో తనకు వ్యక్తిగతంగా సంబంధాలు బాగానే ఉన్నాయని అన్నారు. నితీష్‌ను గౌరవిస్తానని, ఆయనను కలవడంతో ఇబ్బంది లేదని చెప్పారు.
అక్టోబర్ 24న అనంత్ సింగ్‌ను జేడీయూ బహిష్కరించింది. పార్టీ ఆదేశాలను ధిక్కరించడం, అగ్ర నాయకత్వంపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం వంటి కారణాలుగా పార్టీ వెల్లడించింది. అనంత్ సింగ్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ అభ్యర్థి అనుజ్ సింగ్‌కు మద్దతు ప్రకటించారని జేడీయూ ఆరోపించింది. ఇదే సమయంలో సొంత పార్టీ నేత ఎమ్మెల్సీ నీరజ్ కుమార్‌ను ఓడిస్తామని కూడా అనంత్ కుమార్ సవాల్ చేసినట్లు జేడీయూ చెప్పింది.

