NTV Telugu Site icon

Anand Mahindra: రూపాయి ఇడ్లీ అవ్వకు ఇల్లు.. నెటిజన్లు ఫిదా

Mahindra

Mahindra

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటారు. ఆయన దాతృత్వ గుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో సాయం కోరిన వారికి, తమ ప్రతిభతో ఆకట్టుకునేవారి పట్ల ఆయనెంతో ఉదారంగా వ్యవహరిస్తుంటారు. తనవంతు సాయం చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఒక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో రూపాయికే 4 ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్న కమలాత్తాళ్ కు ఆయన ఇల్లు కట్టించి ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆమెకు ఇల్లు కట్టించి ఇస్తానని 2019లో తానిచ్చిన మాటను ఆనంద్ మహీంద్రా నిలుపుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా తాను నూతనంగా నిర్మించిన గృహాన్ని కమలాత్తాళ్ కు అందించారు.

కమలాత్తాళ్ స్వస్థలం తమిళనాడులోని వడివెలంపాలయం గ్రామం. ఆమె గత 37 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా, పేదల కడుపు నింపడమే ధ్యేయంగా అత్యంత చవకగా ఇడ్లీలు అమ్ముతోంది. 2019లోనే ఈ ఇడ్లీ బామ్మ గురించి ఆనంద్ మహీంద్రా అందరికీ వెల్లడించారు. ఆమె కట్టెల పొయ్యిపై కష్టపడుతుండడంతో గ్యాస్ కొనిస్తానని మాటిచ్చారు. ఆపై ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడది చేసి చూపించారు. తాజాగా ఇంటి నిర్మాణ పనులు, కమలాత్తాళ్ నూతన గృహప్రవేశ దృశ్యాలతో కూడిన వీడియోను ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. మదర్స్ డే నాడు ఆ ఇంటిని ఇడ్లీ అమ్మకు ఇచ్చేలా ఎంతో కష్టపడి సకాలంలో పని పూర్తిచేసిన తమ బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆనంద్ పేర్కొన్నారు. మాతృమూర్తికి ఉండాల్సిన లక్షణాలకు కమలాత్తాళ్ ప్రతిరూపమని కొనియాడారు. పెద్ద మనసు చాటుకున్నారంటూ ఆనంద్ మహీంద్రాను అభినందిస్తున్నారు.

Vemula Prashanth Reddy : మిడతల దండులా నడ్డా, రాహుల్ తెలంగాణ మీద పడ్డరు