NTV Telugu Site icon

Amul Issue: తమిళనాడులో అమూల్ రగడ.. అమిత్ షాకు స్టాలిన్ లేఖ

Amul Vs Aavin

Amul Vs Aavin

Amul Issue: కర్ణాటక ఎన్నికల సమయంలో రాజకీయాలను కుదుపుకుదిపేసిన అమూల్ పాల వివాదం ప్రస్తుతం తమిళనాడును తాకింది. గుజరాత్ కు చెందిన ఓ ప్రముఖ పాల కంపెనీ అమూల్, తమిళనాడు రాష్ట్రంలో పాలను సేకరించేందుకు సిద్ధం అయింది. అయితే నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అమూల్ వల్ల రాష్ట్రంలోని అవిన్ బ్రాండ్ కు ఆదరణ తగ్గే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో అమూల్ పాలసేకరణను ఆపేలా ఆదేశించాలని కేంద్ర హోంమంత్రికి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు.

అమూల్ పాల కంపెనీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాడి రైతుల నుంచి పాలను సేకరించి దేశవ్యాప్తంగా అమ్ముతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఉత్తర జిల్లాల నుంచి పాలను సేకరించడానికి అక్కడి రైతులతో మాట్లాడుతోంది. తమిళనాడు డైరీ కోఆపరేషన్ బ్రాండ్ అవిన్ పాలకు చెల్లిస్తున్నదాని కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామని అమూల్ కంపెనీ హామీ ఇస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం తమిళనాడు ప్రభుత్వ ఆగ్రహానికి కారణం అయింది.

Read Also: Allahabad HC: కారణం లేకుండా జీవిత భాగస్వామితో సెక్స్‌కు నిరాకరించడం మానసిక క్రూరత్వమే..

అవిన్ ను దెబ్బతీసేందుకే అమూల్ ఇలా చేస్తుందని తమిళనాడు ఆరోపిస్తోంది. అమూల్ డైరీకి చెందిన కైరా జిల్లా సహాకార పాల ఉత్పత్తిదారుల సంఘం తన బహుళ-రాష్ట్ర సహాకార లైసెన్సును ఉపయోగించి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చిల్లింగ్ యూనిట్, ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు మా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. కృష్ణగిరి, ధర్మపురి, వేలూర్, రాణిపేట, తిరుపత్తూర్, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల్లోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంఘాల ద్వారా పాలను సేకరించాలని అమూల్ యోచిస్తుందని, ఇది ‘ఆపరేషన్ వైట్ ఫ్లడ్’’కు వ్యతిరేకమని, దీని వల్ల పాల కొరతతో పాటు వినియోగదారుల సమస్యలు పెరుగుతాయని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నాడు.

కర్ణాటక ఎన్నికల ముందు ఇలాగే అమూల్ వివాదం ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అమూల్ వర్సెస్ నందినిగా ఈ వివాదం మారింది. అమూల్ వల్ల రాష్ట్రంలోని నందిని డైరీకి కాలం చెల్లుతుందని కాంగ్రెస్ ఆరోపించింది.