NTV Telugu Site icon

Amul: ఎక్స్ యూజర్లపై ‘‘అమూల్’’ ఫిర్యాదు.. తిరుపతి లడ్డూ వివాదమే కారణం..

Amul

Amul

Amul: తిరుమల తిరుపతి దేశస్థానం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని ఉపయోగించారని, అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందనే వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వెంకన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి తోడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా నివేదిక కోరింది.

ఇదిలా ఉంటే, లడ్డూల తయారీలో తమ నెయ్యి ఉపయోగించినట్లు వస్తున్న ఆరోపణలపై ప్రముఖ డైరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ మండిపడింది. తమపై వస్తున్న తప్పుడు కథనాలపై అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమూల్ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని కంపెనీ సరఫరా చేసిందని అమూల్ పరువు తీసే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: Lebanon: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లలో ఈ బ్యూటీ హస్తం..! ఈమె ఎవరో తెలుసా..?

గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్, జయేన్ మెహతా ఈ సమస్యను ప్రస్తావిస్తూ.. ‘‘తిరుపతి దేవస్థానం లడ్డూలలో ఉపయోగించే నెయ్యి కల్తీది అని చాలా రోజులుగా పోస్టులు వ్యాపిస్తున్నాయి. కొంత మంది నెయ్యి సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. అమూల్ తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయలేదని నేను స్పష్టం చేస్తున్నాను. అమూల్‌ని ఈ వివాదంలోకి లాగా దాని ప్రతిష్ట దిగజార్చే వారే మేము పోలీసులు వద్ద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి కారణం’’ అని అన్నారు.

అమూల్ 3.6 మిలియన్ల రైతుల కుటుంబాలకు చెందినదని, ఈ తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అందుకు మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమూల్ ఎప్పుడూ తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయలేదని చెప్పారు. తమ ఉత్పత్తులు నాణ్యతకు తగ్గట్లు ఉంటాయని చెప్పారు. తాము వినియోగదారులకు ప్రీమియం నెయ్యిని అందచేస్తున్నామని మెహతా చెప్పారు. మరోవైపు హిందూ సంస్థలు, కేంద్రమంత్రులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, నిందితులను శిక్షించాలని కోరారు.