MUDA Scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో చిక్కుకున్నారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉంటే, తాజాగా సిద్ధరామయ్యకి మరో షాక్ తగిలింది. ముడా చీఫ్ మరిగౌడ ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ బుధవారం రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మరిగౌడ, సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. దీర్ఘకాలిక మిత్రడు. 1983 నుంచి సిద్ధరామయ్యతో కలిసి పనిచేస్తున్నాడు. 1995లో మైసూర్ తాలూకు పంచాయతీ అధ్యక్షుడిగా, 2000లో జిల్లా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. మరిగౌడ రాజీనామాపై సిద్ధరామయ్య ఇంకా స్పందించలేదు.
Read Also: India-Canada Row: ఇండియాపై కెనడా ఆంక్షలు విధిస్తే.. భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు..?
సీఎం సిద్ధరామయ్యపై మైసూర్ లోకాయుక్త, ఈడీ కేసులు పెట్టింది. ఇదే కాకుండా సీఎం సాక్ష్యాలు నాశనం చేసిన ఆరోపణల్ని కూడా ఎదుర్కొంటున్నాడు. ఈ నెల ప్రారంభంలోనే ఈడీకి ఫిర్యాదు వెళ్లింది. మైసూర్ నగరాభివృద్ధి కోసం సీఎం భార్య పార్వతి నుంచి మూడెకరాల భూమిని తీసుకుంది. అయితే, దీనికి ప్రతిఫలంగా పొందిన భూమి ఇచ్చిన భూమి కన్నా కొన్ని రెట్లు విలువైనది కావడంతో వివాదం ప్రారంభమైంది. మైసూర్‌లో అత్యంత విలువైన విజయనగర్ ప్రాంతంలో 14 ప్లాట్లను కేటాయించడం మొత్తం వివాదాస్పదంగా మారింది.
ఈ కేసుపై పలువురు యాక్టివిస్టులు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కి ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలైంది. గవర్నర్ సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశించారు. అయితే, ఈ ఆదేశాలను కర్ణాటక హైకోర్టులో సీఎం సవాల్ చేశారు. అయితే, విచారించిన హైకోర్టు సీఎం విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తూ బీజేపీ, జేడీఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.