NTV Telugu Site icon

Rains: ముంబయిని వణికిస్తున్న వరుణుడు.. మరోసారి భారీ వర్షసూచన

Mumbai Rains

Mumbai Rains

దేశ ఆర్థిక రాజధాని ముంబయిని వరుణుడు వణికిస్తున్నాడు. సోమవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి ముంబయి నగరం మొత్తం జలమయమైంది. వీధుల్లో నీరు నిలిచిపోయి వాహ‌న‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు మునగడంతో ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాక హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్రలోని ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, పూణే, బీడ్, లాతూర్, జల్నా, పర్భానీ తదితర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. సియాన్‌, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్లలో రైళ్లు, బ‌స్సు స‌ర్వీసుల‌కు అంత‌రాయం ఏర్పడింది. లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న రైల్వే ట్రాక్‌ల‌పై వ‌ర‌ద నీరు చేరుతోంది. ముంబైలో స్వల్ప స్థాయి నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రాబోయే కొన్ని రోజుల్లో ప‌లు చోట్ల అతిభారీ వ‌ర్షాలు ప‌డే ఛాన్సు ఉన్నట్లు కూడా చెప్పింది. వ‌ర్షాల నేప‌థ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాల‌ను అప్రమ‌త్తం చేశారు. ముంబైతో పాటు స‌మీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్‌ ద‌ళాలు అప్రమ‌త్తంగా ఉండాల‌ని మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు.

Heavy Rains in Telangana: కురుస్తున్న వర్షాలు.. మూడు రోజులు భారీ వానలు

ముంబయి నగరంలో గత 12 గంటల్లో 95.81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శివారు ప్రాంతాల్లోనూ 110 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ముంబయితో పాటు ఠాణే, పాల్ఘర్‌, పుణెల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఠాణేలో సోమవారం ఉదయం నుంచి ఈ ఉదయం వరకు 146 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధికారులను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం (సీఎంఓ) మంగళవారం తెలిపింది. షిండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనుకుమార్ శ్రీవాస్తవతో చర్చలు జరిపారు. అలాగే సంబంధిత జిల్లాల సంరక్షక కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని నియంత్రించాలని ఆదేశించారు. రానున్న కొద్ది రోజుల్లో భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసేందుకు ముఖ్యమంత్రి స్వయంగా కొంకణ్ ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Telangana: దంచికొడుతున్న వాన‌లు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు

ముఖ్యంగా రాయ్‌గఢ్, రత్నగిరి, థానే, పాల్ఘర్, సింధుదుర్గ్ మరియు కొల్హాపూర్ జిల్లాల్లో, వర్షాల కారణంగా పెరుగుతున్న నీరు.. వరదల పరిస్థితి గురించి పౌరులకు తెలియజేయాలని, తరలింపు కోసం తగిన ప్రదేశాలలో ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ముంబైలో పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని షిండే అధికారులను ఆదేశించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కుండలికా నది హెచ్చరిక స్థాయిని దాటిందని, అంబా, సావిత్రి, పాతాళగంగ, ఉల్హాస్, గర్హి నదుల నీటిమట్టం హెచ్చరిక స్థాయి కంటే స్వల్పంగా దిగువన ఉంది. దీంతో పాటు జగబూడి, కాజ్లీ నదుల నీరు హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తున్నందున జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రానున్న ఐదు రోజుల్లో గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్తా ఆంధ్రా, యానాం, తెలంగాణ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, మాహేలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.