Amazon Layoff: అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, ఆర్థిక మాంద్యం భయాలు ఐటీ ఇండస్ట్రీతో పాటు సర్వీస్ సెక్టార్ ని భయపెడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించింది. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా అనేక కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది జనవరిలో 18 వేలను తొలగించిన అమెజాన్.. మార్చిలో మరో 9000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అమెజాన్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడం ఇదే ప్రథమనం కంపెనీ వార్షిక ప్రణాళిక ప్రక్రియలో భాంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాస్సీ ప్రకటించారు.
ఇదిలా ఉంటే అమెజాన్ ఇండియా కంపెనీలో ఉద్యోగుల తొలగింపుల్లో భాగంగా ఇప్పుడు ఇటీవల కొన్ని రోజుల నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ (PXT), హెచ్ఆర్, ఇతర వ్యాపార విభాగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఎక్కువగా ప్రభావితం అయ్యారు. రాబోయే కొన్ని వారాల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు భారత్ లో 400-500 మందిని తొలగించినట్లు తెలుస్తోంది.
Read Also: Delhi: భార్యా పిల్లలను కడతేర్చిన కసాయి.. చివరకు ఇంటర్నెట్‌లో చదివి భర్త ఆత్మహత్య..
అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS) సీఈఓ ఆడమ్ సెలిప్ స్కీ జారీ చేసిన మెమోల్లో.. ఏప్రిల్ చివరి నాటికి ఏడబ్ల్యూఎస్ అమెరికాలో ఉద్యోగుల తొలగింపులు ప్రారంభం అవుతాయని క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ప్రకటించారు. ఆదాయ వృద్ధిలో మందగమనం ఇందుకు కారణం అని సెలిప్ స్కీ వెల్లడించారు.
పెరుగుతున్న వడ్దీ రేట్లు, ఆర్థిక మాంద్యం భయాల వల్ల అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి టెక్ కంపెనీలు. ఇప్పటికే ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా రెండు పర్యాయాలుగా వేలల్లో ఉద్యోగులను తీసేసింది. ఈ ఏడాది గత నెలలో 10,000 మందిని, గతేడాది నవంబర్ లో 11,000 మందిని తొలగించింది. గూగుల్ 12,000, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ 50 శాతం మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
