పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తిరేపుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్ పార్టీలో కుంపటితో బయటకు వచ్చిన పంజాబ్ మాజీ సీఎం, సీనియర్ పొలిటికల్ లీడర్ అమరీందర్ సింగ్.. త్వరలో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు.. అంతేకాదు బీజేపీతో పొత్తు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం పార్టీ ఏర్పాటుపై.. అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ ట్వీట్ చేయడం హాట్ టాపిగ్గా మారింది. తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలను, వ్యక్తులను కలుపుకుపోతామని తన అధికార ప్రతినిధి ద్వారా వెల్లడించారు అమరీందర్ సింగ్.
79 ఏళ్ల అమరీందర్ సింగ్.. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను సిద్ధూకు అప్పగించడంపై కెప్టెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వీరిద్దరి మధ్య నెలకొన్న పరిణామాలు, అధిష్టానం తీరుతో అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. మరుసటి రోజే అమరీందర్.. ఢిల్లీకి వెళ్లి అమిత్‌షాతో భేటీ కావడం హాట్ టాపిగ్గా మారింది. ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం కూడా సాగింది. తాను బీజేపీలో చేరడం లేదని ఆ తరువాత క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అమరీందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్త పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. అమరీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయం పంజాబ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం బలంగానే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
