Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్సీపీ అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే శివసేనల ‘‘మహాయుతి’’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 233 సీట్లను గెలిచింది. అయితే, విజయం సాధించిన నాలుగు రోజులైనప్పటికీ, మహారాష్ట్రకు కాబోయే కొత్త సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఏక్‌నాథ్ షిండే ఉన్నారు.
Read Also: Hyderabad Crime: సోదరిపై యువకుడు కామెంట్.. కొట్టి చంపిన సోదరులు
సీఎం పదవిపై దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతిలోని మూడు పార్టీలు ఇంకా నిర్ణయం తీసుకుంటున్నాయని, త్వరలోనే సమాధానం చెబుతామని ఆయన చెప్పారు. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయతాయని, మూడు పార్టీలు కలిసి సీఎంని ఎంపిక చేస్తారని చెప్పారు. మహాయుతి ముఖ్యమంత్రి ఎంపికపై ఆలస్యం చేయడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే, బీజేపీ వర్గాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తొందర లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవితో పాటు బీజేపీ, శివసేన, అజిత్ పవార్ నేతలు మంత్రి పదవులపై ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. సీఎంతో పాటు 43 మంది మంత్రులు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. 132 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీకి సగం మంత్రి పదవులు రావచ్చని తెలుస్తోంది. మిగతా వాటిలో ఎన్సీపీ, శివసేన పంచుకోనున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. దేవేంద్ర ఫడ్నవీస్‌ని బీజేపీ అధిష్టానం సీఎంగా ఖరారు చేసిందని అన్నార. దీంతోనే ఏక్‌నాథ్ షిండే అసంతృప్తితో ఉన్నాడని చెప్పారు. మరోవైపు శివసేన అధికార ప్రతినిధి నరేష్ మాస్కే బీహార్‌లో లాగా సంఖ్యాబలం చూడకుండా ఏక్‌నాథ్ షిండేని సీఎం చేయాలని చెప్పారు.