Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

  • హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీకి చట్టపరమైన రక్షణ లేదని హైకోర్టు స్పష్టం.
  • బాధితురాలి మాజీ భర్త, మౌలానా సహా నిందితుల పిటిషన్లు కొట్టివేత.
  • వ్యక్తిగత చట్టాలు నేరాలకు కవచంగా మారలేవని కోర్టు వ్యాఖ్య.
Allahabad High Court

Allahabad High Court

Allahabad High Court: నికాహ్, హలాలా, ట్రిపుల్ తలాక్ వంటి పద్ధతులపై అలహాబాద్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ పద్ధతుల ముసుగులో మహిళలపై జరిగే లైంగిక దోపిడీని అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి పద్ధతులు సమాజపు ‘చీకటి అధ్యాయం’ అని, ఇవి రాజ్యాంగ విలువలకు, సమానత్వానికి, మానవ గౌరవానికి విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్యలు చట్టరీత్యా నేరాలు మాత్రమే కాకుండా, సమాజపు సామూహిక మనస్సాక్షిని కూడా కదిలిస్తాయని కోర్టు పేర్కొంది. జస్టిస్ జె.జె. మునీర్, తరుణ్ సక్సేనాలతో కూడిన డివిజన్ బెంచ్, బాధితురాలి మాజీ భర్త, మామ, ఒక మౌలానాతో పాటు ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. వ్యక్తిగత చట్టాల ముసుగులో నేరాలకు రక్షణ కల్పించలేమని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు ప్రాథమికంగా ఒక మైనర్‌పై పథకం ప్రకారం జరిగిన సామూహిక అత్యాచారాన్ని సూచిస్తోందని, దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని కోర్టు నిర్ధారించింది.

ఈ కేసు ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహాలోని సైద్‌నగ్లి ప్రాంతంలో నమోదైంది. ఈ కేసులో బాధితురాలిని మళ్లీ పెళ్లి చేసుకుంటామని చెప్పి బాల్య వివాహం, ట్రిపుల్ తలాక్, హలాలా, పదే పదే లైంగిక దోపిడికీ పాల్పడ్డారు. నిందితులు ఈ కేసును కొట్టేయాలని, తమ అరెస్టులపై స్టే విధించాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, తిరస్కరించబడ్డాయి. ఈ కేసు విచారించిన హైకోర్టు.. ఇప్పటివరకు వెల్లడైన వాస్తవాలు అత్యంత తీవ్రమైనవని, ప్రాథమికంగా చూస్తే నిందితులందరి చర్యలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని, దర్యాప్తు కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆ తర్వాత ‘సెకండ్ హలాలా’ పేరుతో సామూహిక అత్యాచారానికి గురైందని ఆరోపణలు ప్రాథమికంగా చూపిస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఇలాంటి వాటిని తుదిలోనే తుంచేయాలని కోర్టు పేర్కొంది.

కేసు వివరాలు:

బాధితురాలిని 2015 ఏప్రిల్‌లో ప్రధాన నిందితుడైన అజహర్ నవాజ్‌తో బలవంతంగా పెళ్లి చేశారు. అప్పుడు ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు. 2016 జనవరిలో నిందితుడు ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. కొన్ని నెలల తర్వాత నవాజ్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. 2016 నవంబర్‌లో తన సహ నిందితుడైన మౌలానా ఖయ్యూమ్‌తో బాధితురాలికి నికాహ్ హలాలా చేసుకున్నాడు. హలాలా జరిగినప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు. ఆ సమయంలో హలాలా అంటే తనకు తెలియదని బాధితురాలు కోర్టుకు చెప్పింది. 2017లో నవాజ్‌ను తిరిగి పెళ్లి చేసుకుంది. అయితే, నాలుగేళ్ల తర్వాత నవాజ్ మరోసారి ఆమెకు విడాకులు ఇచ్చి, వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. నవాజ్ కొత్త భార్యకు పిల్లలు లేకపోవడంతో, తిరిగి బాధితురాలిని తమ ఇంటికి తీసుకువచ్చి, కుటుంబంతో ఉండమని కోరారు. ఆమె పెళ్లి రెండుసార్లు నాశనం అయింది. ఆమె రెండు సార్లు హలాలా ఆచారాలు పాటించాల్సి ఉంటుందని కుటుంబీకులు ఆమెకు చెప్పారు. దీని తర్వాత డబుల్ హలాలా పేరుతో ప్రధాన నిందితుడి సోదరుడు, మేనల్లుళ్లు 2025 ఫిబ్రవరి 19న ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సాయంత్రం ఆమెకు బూటకపు పెళ్లి జరిపించారు.