Site icon NTV Telugu

Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో ఎస్పీ చీఫ్ అఖిలేష్‌కి సీబీఐ సమన్లు..!

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసు విచారణలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా హాజరుకావాలని సమన్లలో కోరారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ని రేపు దర్యాప్తు సంస్థ ప్రశ్నించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తర్ ప్రదేశ్ హమీర్‌పూర్ అక్రమ మైనింగ్ కేసులో సాక్షిగా అఖిలేష్ యాదవ్‌ని హాజరుకావాల్సిందిగా కోరింది. సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద సిబిఐ నోటీసు జారీ చేసింది. ఢిల్లీలోని సీబీఐ ముందు హాజరుకావాలని కోరింది. నేరపూరిత కుట్ర, దొంగతనం, దోపిడీ, మోసం వంటి నేరాలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది. అక్రమ మైనింగ్‌కి అనుమతించినందుకు 11 మంది అజ్ఞాత ప్రభుత్వోద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అఖిలేష్ 2012 నుంచి జూన్, 2013 మధ్య మైనింగ్ శాఖను నిర్వహించాడు.

Read Also: Andrea Jeremiah : అలవాటు పడిపోయా.. ఇక పెళ్లొద్దంటున్న హీరోయిన్

ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు, షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్‌పూర్, హమీర్‌పూర్ మరియు సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి 2016 మధ్య కాలంలో నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ అధికారులు కొన్ని అక్రమ మైనింగ్ స్థలాలను కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు కూడా ఇచ్చారని సీబీఐ పేర్కొంది.

జూలై 2016లో, అలహాబాద్ హైకోర్టు హమీర్‌పూర్‌లో అక్రమ మైనింగ్‌ను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై అసంతప్తి వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకోవడాన్ని అనుమతించలేమని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అధికారుల సహకారంతో అక్రమ మైనింగ్ జరుగుతోందా..? లేదా..? అనే దానిపై నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ తాజాగా చర్యలకు ఉపక్రమించింది.

ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు అవనీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ విచారణకు హాజరుకావాలని 8 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇక జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ని కూడా అవినీతి ఆరోపణల్లో ఈడీ అరెస్ట్ చేసింది. పశ్చిమబెంగాల్ టీఎంసీ నేతలు కూడా పలు కుంభకోణాల్లో చిక్కుకున్నారు.

Exit mobile version